పుట:Navanadhacharitra.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవనాథ చరిత్ర

ఖణికాఖ్య సిద్ధుని కథ.

నెసఁగు తపంబున ◆ నిఱ్ఱింకులింకి
వసివాళ్లువాడుచు ◆ వంగిన మేను
ముడివడి మడిమెలు ◆ మోవ వ్రేలాడు
జడలును వలచేతి ◆ జపమాలికయును
గాలిఁ దూలాడెడు ◆ గడ్డంబుఁ జంకఁ
బోల నునిచిన భూతి ◆ బుఱ్ఱకాయయును
సమలినజలపూర్ణ ◆ మగు కమండలము
కొమరారఁ [1]దూఁగాడు ◆ కుండలంబులును
దన కలవడఁ బ్రమో ◆ దంబు చిత్తమున
మొనయ నాక్షణమె స ◆ న్ముని వచ్చె నటకు
నాలీలఁ జనుదెంచి ◆ యసమలోచనునిఁ
బోలి దిక్కులఁ జను ◆ భూరితేజమున
నొవ్పెడు నాథము ◆ ఖ్యున్నిఁ గాంచి భక్తి
ముప్పిరిగొనఁజేరి ◆ [2]ముదమునఁ జాఁగి
మ్రొక్కిన నిజకరం ◆ బున లేవనెత్తి
మిక్కిలి కృపఁజూచు ◆ మీననాథునకు
మునిపతి కరములు ◆ మొగిచి యిట్లనియె
ననఘాత్మ నావీను ◆ లార నీమహిమ
విన్నది మొదలుగా ◆ వెలయు నీమూర్తి
కన్నులపండువు ◆ గాఁ జూచుభాగ్య
మెన్నఁడు సమకూరు ◆ నింక నా కనుచు
నున్నచో నిచటి క ◆ త్యున్నతలీల
నరుగుదెంచితిరి కృ ◆ తార్థుండ నైతి
సరగున నొసఁగవె ◆ శారీరసిద్ధి
నావుడు నమ్మీన ◆ నాథుండు దెలిసి
పోవఁగ నమ్ముని ◆ పుంగవుం డెవ్వఁ
డనుచు నాగార్జును ◆ నాననాంబుజముఁ
గనుఁగొన్న నాతఁడు ◆ గరములు మొగిచి
యితఁడువో ముని శాప ◆ మిచ్చి తన్నిట్టి
గతినుండఁ జేసిన ◆ ఖణికాఖ్యుఁ డనిన
నామునిఁజూచి యి ◆ ట్లనె మీననాథుఁ

  1. దూలగా.
  2. ముదము సాష్టాంగ.