పుట:Navanadhacharitra.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xviii

పెట్టినాఁడు అని భీమన్నతలఁచి, యా యాంధ్రశబ్దచింతామణి నణఁచివేసినాఁడఁట. ఇక్కడ సర్వసాక్షి యగు నీవిష్ణువు పలుకులలో సందర్భశుద్ధి గాన రాకుండుట గమనింపఁ దగియున్నది. మొదట ఆంధ్రశబ్దచింతానుణి రచించి యసూత్రముల కుదాహరణముగా భారతము మూఁడు పర్వములు చెప్పే నన్నట్లున్నది. కాని రెండవ వాక్యములో నన్నయ్య భారతము ముందు రచించి, భీమన్న రాఘవపాండవీయము నణఁచివేసినట్లును, అటు తరువాత , భీమన ఛందస్సు నడంచుటకుగా నీ(వ్యాకరణ) ఫక్కి సంగ్రహించినట్లును, అపుడు భీమనదాని నడంచినట్లును జెప్పఁబడినది. కావున నన్నయ రచనలు రెండింటిలో నేది పూర్వమో యనునదినిశ్చిత మగుటయే లేదు. ఇంతవఱ కీ రెండువాక్యములు పరస్పరము విరుద్ధములుగా నున్నవి. అంతేగాక రెండవ వాక్యమును బట్టి ఆంధ్రశబ్ద చింతామణికంటె ముందే భారతము రచియింపఁబడిన ట్లూహింపవలసి వచ్చుచున్నది. ఇకనిట్లు నన్నయఫక్కి భీమనచే గోదావరిలోఁ గలుపఁబడుటచే నాంధ్రమున సూత్రసంపాదన లేకపోయినదఁట. ఆకారణముచే నాదిని శబ్ద శాసనమహాకవి చెప్పిన భారతములో నేదివచింపఁగాఁ బడియెనో దానినె కాని దెనుఁగుపల్కు మఱొక్కటిఁగూర్చి చెప్పఁగారాదని దాక్షవాటి కవిరాక్షునుఁ డొక నియమము చేసెనఁట, ఈ కవిరాక్షనుఁడు భీమనకవి యనియే ప్రసిద్ధి గదా. 'సూత్రసంపాదన' లేమిచే ననుటవలనఁ బ్రధ్వంసాభావమేనా మనము గ్రహింపవలసియున్నది ? భీమన దాని నణఁచివేసె నని చెప్పఁబడినది గదా. నన్నయ వ్యాకరణము నడంచిన భీమకవియే మరల నీ నియమమును జేసి యుండెనఁట! ఈతఁ డీ నియమము చేసియుండుటను బట్టియే యాతని మాటను జవదాఁటనొల్లక మహాకవులగు తిక్క సుధీమణి మొదలైన తొంటి తెలుఁగు కవీంద్రు లెల్లరు నా మూఁడు పర్వములలో నా మాన్యుఁడు నుడివిన తెలుఁగు లరసికొనియే తమ కృతులు రచించినారఁట. తిక్కన కేతనాదులు రచించిన తెలుఁగు పలుకుబళ్లకు నన్నయ మూఁడు పర్వములలోని తెలుఁగులే యాధారము కాఁబోలును నూత్నదండియగు కేతనయుఁ దెనుఁగునకు లక్షణము వాని ననుసరించియే చెప్పియున్నవాఁడా ? ఇఁక భీమన యడంచిన యా నన్నయ యాంధ్రఫక్కి నెఱింగిన వాఁ డొక్కరుఁడు మాత్ర మున్నాఁడఁట. ఆతఁడు రాజురాజ నరేంద్రతనూజుఁ డగు సారంగధరుఁడు. ఈతఁడు తన శైశవమునందే నన్నయ యాంధ్రఫక్కిని రచించుచుండఁగానే యాతనియొద్ద పఠించి నాఁడఁట. ఈతనికిఁ దక్క మఱియన్యుల కెవ్వరికి నిది తెలియ దన్నాఁడు విష్ణువు. భీమన దీనిని రచింపఁబడిన వెంటనే యడంచినట్లు తెలియవచ్చుచున్నది గదా! వీ రిద్దఱకు దక్క నన్యు లెవ్వరికిఁ దెలియదని దానికర్థమగునా? ఆ సారంగధరుఁడు, జనకుండు మతిచెడి తన కాళ్లుచేతులు నఱికింపఁగాఁ మత్స్యేంద్రుని సాంగత్య