పుట:Navanadhacharitra.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

77

అనియని విలపించు ◆ నలమరి వగచుఁ
దనమది నొక్కింత ◆ ధైర్యంబు నిలిపి
పాయునే తనకర్మ ◆ ఫల మని వగచు
మాయురే చిత్రాంగి ◆ మా యని పొగడుఁ
గటకట ! దైవమా ! ◆ కరుణింపు మనుచు
నిటు చేయఁ దప్పు నే ◆ నేమి చేసితిని
మరులువెట్టినవారి ◆ మాయలుగాక
పరికింప దైవ మే ◆ పట్టునఁ గలఁడు
అనుచు దైవము దూఱు ◆ చక్రభాగమునఁ
దునకలైపడిన చే ◆ తులఁ బదంబులను
నలిఁ జూచి మంత్రినం ◆ దనుని వాక్యములు
తలపోసి తలయూఁచి ◆ తార్కాణ మిచ్చి
యొకమరి నవ్వు వే ◆ ఱొకమరి యేడ్చు
నొకపరి పాడు వే ◆ ఱొకపరి మూల్గు
నొకపరి గిరిశ ! మ ◆ హోరగాభరణ !
సకల లోకేశ్వర ! ◆ శశికళాకల్ప !
పురహర సితికంఠ ! ◆ భూతేశ ! నీవె
శర ణని యీరీతి ◆ సంతాప మందు
నవనీశుసుతుతోడ ◆ న[1]నుకంప మీఱ
దివినుండి యాధర్మ ◆ దేవత పలికె
నో కుమారక ! వల ◆ దుడుగుమీ వగపు
నీకు నీవిధి తప్ప ◆ నేర దె ట్లనిన
వినుము నీతొల్లింటి ◆ వృత్తాంత మెల్ల
వినిపింతు నని పల్కె ◆ విస్మయం బొదవ
నవనిపైఁగౌశాంబి ◆ యను పట్టణమున
ధవళచంద్రుండను ◆ ధరణీశుఁ డేలు
ననుపమమతులు జ ◆ యంతసుమంతు
లను మంత్రివరు లిద్ద ◆ ఱతనికిఁ గలరు
ఆయిరువురలోన ◆ ననఘు సుమంతుఁ
బాయక మన్నించుఁ ◆ బార్థివేశ్వరుఁడు
దానికి ననిశంబు ◆ దనరుసుమంతుఁ
బూని జయంతుఁ డె ◆ ప్పుడుఁ జంప నలుగు

  1. అనిశంబుమీర.