పుట:Navanadhacharitra.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xii

డగు శాంతభిక్షావృత్తి యతీశ్వరుఁడే నవనాథచరిత్ర రచనమును ప్రోత్సహించినవాఁ డగుటచే గౌరన శ్రీనాథుని చరమకాలమునను నాతని తరువాతను జీవించి యుండె ననుటకు సందియము లేదు.

కృతిరచనకుఁ బ్రోత్సాహము:

నవనాథచరిత్రమున గౌరన ముక్తిశాంత భిక్షావృత్తిరాయని, నాతనివై భవమును విశేషముగా వర్ణించినాఁడు. ఆతఁడు మల్లికార్జున శ్రీమహాలింగ సర్వలోకోత్తమ సామ్రాజ్యభారనిర్వాహక ప్రౌఢినీతికోవిదుఁడు. విపులవిశ్వంభరావిశ్రుతాశేష నృపవర స్వీకృతనిజశాసనుండు. అనుపమ నిజతపోబల విశేషానుసంధానరక్షిత సకలకర్ణాట మండలాధీశ రమావిలాసుఁడు. ఆతని మహావైభవం బాతని లోకోత్తమ సామ్రాజ్యనిర్వాహకత్వమునకుఁ దగియే యున్నది. కర్పూరహిమజల కాశ్మీరమిళిత దర్పసారాంబుసిక్తప్రదేశమును దపనీయ జాలకాంతరగత ధూప విపులసౌరభసమన్విత గంధవాహవాసిత దశదిశా వలయంబు నగు నిజసభావనంబునందు రత్న సింహాసనమునఁగూర్చుండి, బిరుదందెబాగొందు వాని చరణాబ్దమునకు మండలేశ్వరులు మ్రొక్క, పచ్చలపదకంబు చీనాంబరంబు కరభూషణంబుల వజ్రరుచులు నవతంసమాణిక్య లలిత కాంతులు ప్రకాశింప రజితాద్రిమీఁదఁ బ్రమదమారఁగనున్న పరమేశుఁడనఁగఁ గొలువుదీరియుండఁ, దపోమహిమరూఢి కెక్కినమునీంద్రులు పదవాక్య ప్రమాణజ్ఞు లగు విద్వాంసులు బహువిధ నాటకాలంకార నైపుణిఁ జాటువకెక్కిన సత్కవీశ్వరులు, జంత్రగాత్రముల నేర్పుగలిగి వాసికెక్కిన గాయకోత్తములు, నటీనటజనులుఁ బాఠకులు, దొరలు, భృత్యులు, నమాత్యులుఁ బురోహితులు, రాయబారులు, వైద్యవరులు, దైవజ్ఞులు వరుసతో నాతనిఁ గొలిచియుండిరి. ఈతఁడు యతీశ్వరుఁడే యైనను మహారాజభోగమున నుభవించుచుండువాఁడు. అట్లుకొలువుండి యవిరళయోగ విద్యాధికులైన నవనాథుల పుణ్యచరితము శ్రీగిరికవి పదప్రబంధములఁ జెప్పినదానిని ద్విపదకావ్యముగఁ జెప్పింపవలయు నని తలంచి సరససాహిత్యలక్షణ వివేక మహితుఁడును భ్రమరాంబికావరప్రాప్త విచిత్ర విమల సాహిత్య ప్రవీణాధికుండునగు గౌరనాహ్వయునిఁ బిలిపించి 'మధురమై వెలయు నవనాథచరితంబు ద్విపదకావ్యంబుగాఁ జేసి కమలజ విష్ణుసేవ్యమానుఁడగు శ్రీశైలపతికి నంకితం బొనరింపుమని చెప్పి కర్పూర తాంబూలంబు లొసఁగి గారవించెను. దీనినిబట్టి నవనాథుల పుణ్యచరిత్రము శ్రీగిరికవిపద్యప్రబంధముల నింతకుఁ బూర్వమే ప్రసిద్ధమై యున్న ట్లగపడుచున్నది. దానినిబట్టియే గౌరన దీనిని ద్విపదలలో రచించెను. కాని యా శ్రీగిరికవినిగూర్చిన విశేషములుగాని, యాతని పద్య ప్రబంధముగాని, యిప్పుడు గానవచ్చుట లేదు. ఈకవి శ్రీగిరీశ శతకమును, శ్రీరంగమాహాత్మ్యమును గూడ