పుట:Navanadhacharitra.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

నవనాథచరిత్ర

కోరిన రూపు క ◆ న్గొని తాల్మి నదలి
చేరి దర్పాంధుఁడై ◆ చెయివట్టె ననుచు
మీరు చెప్పితి రని ◆ మేదినీ నాథుఁ
డెల్లవారును విన ◆ నేర్పడఁ బలికెఁ
దెల్లంబుగాఁ దన ◆ తెఱఁ గెల్ల నడుగ
ననిపినఁ బోయి మే ◆ మాకుమారకుని
గని చాల దూఱి ని ◆ క్కము చెప్పు మనినఁ
గటకటా! తనమీఁది ◆ కల్ల నామీఁద
నిటు మోపి రాజున ◆ కెడలుగాఁ జెప్పి
నట్టి దేవులనె మీ ◆ రడుగుఁ డీమాఱు
గట్టిగా ననియె నే ◆ గతి దీని కనిన
నెలుఁగెత్తి యొకరీతి ◆ నేడ్చుచు బిట్టు
చలపట్టి నన్నేల ◆ చంపెదో రాజ
రచ్చల కెక్కించి ◆ రట్టు చేసెదవు
చచ్చినచా వయ్యె ◆ సరివారిలోనఁ
దెగి చావఁబోయినఁ ◆ దివిరి పట్టెదవు
నగుబాటు చేసితి ◆ నాలజ్జఁ గొంటి
నీకు లేదటిసిగ్గు ◆ నేఁడునాకేల
నీకార్యవాదులు ◆ నీవుఁ గన్నార
నిటు జూడుఁడని వారి ◆ యెదుటికిఁవచ్చి
కుటిలాత్ము రాలు పై ◆ కొంగు వోఁదివిసి
కలయంగఁ బురినీళ్లు ◆ గ్రమ్ముచు నున్న
వలుద చన్నుల మీఁది ◆ వ్రప్పులు చూపి
యివియెల్ల నాతప్పు ◆ లీ దుప్పటియును
అవునొ గాదోయని ◆ యది చూడ విభుఁని
ముందట నిడెఁ [1]గింక ◆ ముప్పిరి గొనఁగ
నిందు సందేహంబు ◆ లేటికి ననుచుఁ
గ్రచ్చర పేరోల ◆ గమునకు వచ్చె
వచ్చి భూవిభుఁడు వి ◆ ద్వాంసుల నెల్ల
ధర్మాసనము గూర్చి ◆ తల్లిఁ గామించి
దుర్మదంబునఁ బట్టి ◆ దోషంబుఁ బెట్టి
నటువంటి పాపాత్ము ◆ నడరెల్ల నణఁగ

  1. యింక.