పుట:Narayana Rao Novel.djvu/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నారాయణరా వీ యాలోచనతో గన్ను లరమూతలైపోవ నానంద మయుడైనాడు. వారి లాంచి కొవ్వూరు లంకకడ నాగినది. వారందరు లంకలోదిగి, యీ యిసుక తిన్నెలలో నధివసించి మంతనములు సలుపుకొనుచుండిరి. నారాయణరావు గౌతమీ సమాహూతుడై బిరబిర లాల్చీవిప్పి, యద్ధానిని, యుత్తరీయమును సేవకున కందిచ్చి, కట్టినవస్త్రము వెనుకకు విరిచికట్టి నీటిలోనికి బరుగిడినాడు. ‘లోతులుండును, జాగ్రత్త సుమీ’ యని జమీందారు గారు హెచ్చరింప, స్నేహితులందఱు ‘నారాయణ రావు గజయీత గా’ డని ధైర్యము చెప్పి తాముగూడ నీటిలోనికి దిగిరి. ఒక్క రాజారావునకు మాత్రము ఈత రాదు. ఆత డొడ్డుననే చంటిపిల్లనివలె నీటిలో చేతులు తట్టుచు వినోదించుచుండెను.

గౌతమీమాత కింకను వరదలు రాలేదు. నిర్మల వినీలజలములతో నామె యొక మహాసరస్సువలె నున్నది. గోపీచందనపు బూతల వలె నిసుక తిప్ప లచ్చ టచ్చట తలలెత్తికొనియున్నవి. దూరాన పాపికొండలు స్పష్ట నీలలోహితములగు తమ శిఖరముల నా సంధ్యారుణరాగార్ద్ర గగనము లోనికి జొనిపి యానందించుచున్నవి. పశ్చిమమున లోహిత హరిద్రావర్ణ వికాసమై, మధ్య కర్బురరాగపూరితమై, దిశాంచలముల నవ్యక్తారుణచ్ఛవీ సుందరమై యాకాశము హృదయమును ద్రవింప జేయుచున్నది. కెరటముల హోరు షడ్జమమై, వాయు ప్రసారము రిషభమై, పక్షుల కలకలారావములు పంచమమైపోవ బ్రకృతిమాత మధుర సంగీతమున జొక్కుచున్నది.

పరమేశ్వరమూర్తి నెమ్మదిగా తేలియాడుకొనుచు రాజారావుకడకువచ్చి, ‘ఓ ముగ్ధ బాలుడా! చూడవోయి యీ ప్రకృతి అందం! నీలో నిద్రాణమైయున్న కవితాశక్తి మేల్కొలుపవోయి! అందులో కరిగి మరిగి లీనమై పోవోయి! నారాయుడు అడుగో శివమెత్తి ఆడుతున్నాడు. వేయితీపులు నాలో ఒక్కసారిగా తలలెత్తుతున్నాయోయి’ అనుచు హృదయము వొలుకవోసికొనియెను.

జమీందారుగారి చూపులన్నియు నీటిలోనుంచివచ్చు సుందరమంజుశ్రీమూర్తియగు నల్లునిమీదనే యున్నవి. విశాలాంసలుడై విపులవక్షుడై గోమూర్ధకటి సుందరుడై, అల్పమధ్యముడై, గంభీర వదనుడై, ఉన్నతశరీరుడై జలక్లిన్న ప్రకాశోజ్వల హరిద్రరోహితవర్ణుడై, నీటి చుక్కలు ముత్యములవలె రాలుచుండ గట్టునకువచ్చి తడియార్పుకొనుచుండిన యల్లుని చూచిన యాయన కన్నులు చెమర్చినవి. ఈ బాలకు డవతారమూర్తియని యుబ్బిపోయినాడు. యమునాతీరము, బృందావనము, శ్యామసుందరుడు నాయన మనోవీధి దళుక్కున మెఱసి గోపికాభావ మాయన నావహించినట్లయినది.

రాత్రి యెనిమిది గంటలకు వారంద రింటికి జేరినారు.

వారు గృహమధ్యశాలకు వచ్చునప్పటికి, అచ్చటి సోఫాలపై జగన్మో