పుట:Narayana Rao Novel.djvu/92

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
91
వేదాంతి

బెర్నార్డు షా, ఎయిన్ స్టీన్, ఎడింగ్టన్, ఫ్లాటో, అరిస్టాటిల్ మొదలగు పాశ్చాత్యవేత్తల భావములు హృదయస్థము చేసికొనెను.

నారాయణరావు రాజారావుతో నెల్లప్పుడు వేదాంత విషయముల జర్చ చేయుచు నానందమునొందును. రాజారావు తన జన్మమున నా నిమేషములే శుభ ముహూర్తములని తలచి నారాయణుని రాక కెదురుచూచుచుండును.

‘మన ఆర్షవిజ్ఞానంముందు డార్విన్ సిద్ధాంతాలు బాలశిక్ష వంటివోయి! ఆతని పరిణామవాదం కేవలం భౌతికం. వినికీ, చూపుకూడా లేని కీటకాలుండేవట ఆదిలో. పిమ్మట దృష్టి శ్రవణాది జ్ఞానంగల సరీసృపాలు ఏర్పడినవట. ఆపైన పాలిచ్చే జంతువులేర్పడి, క్రమంగా కొంచెం మెదడు సంపాదించుకొని కోతులై, చివరకు మనుష్యులుగా పరిణమించినవట. జంతుకోటిలో యీ మెట్లన్నీ కనబడుతూనే వున్నాయట. ఈమాత్రం కనిపెట్టినందుకు డార్విన్ వాళ్ళకొక ఋషి అయిపోయినాడు’ అని రాజారావు.

‘నిజమే. కాని, అనంతంగా కనబడే యీ సృష్టిలో ఒక క్రమవిధానాన్నీ, వికాసాన్నీ, పరిణామధర్మాన్నీ దర్శించి చెప్పగలగడం కూడా సామాన్య విషయం కాదు. పురాణాల్లో చెప్పబడ్డ సర్గ విధానాన్ని విచారణ చేసి, అంతరార్ధం గ్రహించకుండా గుడ్డిగా ఆ ముసలమ్మ కథలనే నమ్మడంకన్న, ఆ కథల్నీ కార్యకారణ సమన్వయాలతో ప్రమాణీకరించడం మంచిదంటావా, అనవా? అతీంద్రియజ్ఞానంగల మన ఋషులు చెప్పిన గంభీర సత్యాలకు, వాళ్లు పరిశోధనాపూర్వకంగా ప్రత్యక్ష ప్రమాణాలతో వ్యాఖ్యానం చేస్తున్నారు’ అని నారాయణ రావు.

రాజా: కావచ్చును. కాని కేవల ప్రత్యక్ష ప్రమాణం ఎంత వరకు ఉపయోగిస్తుందంటావు?

నారా: అలాకాదు. వాళ్ళు కూడా ప్రత్యక్షం నుంచి అనుమానాన్నీ సాధిస్తున్నారు గాని ప్రత్యక్షంతో ఆగిపోవడం లేదుగదా.

రాజా: నిజమే. ప్రకృతివిషయం ఇంద్రియ గ్రాహ్యం, బుద్ధిగ్రాహ్యమూ గనక, ఆ రహస్యం సాధిస్తారనుకో. బుద్ధి కూడా మొదటి మెట్టులోనే వుంటుంది గాని పైకి దాటిపోలేదు. బుద్ధికిగూడా గ్రాహ్యంకాని ఆత్మానుభవైక వేద్యమైన పరతత్వం మాట ఏమంటావు?

నారా: ప్రత్యక్షనుమానాలని కూడా గ్రహించని అంధవిశ్వాసం, శుష్క తర్కమూకంటె వాళ్ళబుద్ధివ్యవసాయం ఉత్తమమంటాను. వాళ్లు నిరంతర పరిశోధనవల్ల ఆటం అనే మూలపదార్థాన్ని పట్టుకొన్నారు. ఇంకా లోతుకుపోయి ఆటంకూడా ఎలెక్ట్రాన్ల సంఘాతమని గ్రహించారు. అయితే నువ్వనేది, ఈ యెలక్ట్రాన్లు కూడా అనిత్యపదార్థాలే కాని నిత్యాలు కావుగదా. ఈ అనిత్యాలను పట్టుకొని ఎన్నాళ్ళు ప్రాకులాడినా నిత్యమైన సత్యపదార్థాన్ని చేరలేదంటావు. సరే; బుద్ధిమార్గాన పోగలిగినంతదూరం పోయినతర్వాత