పుట:Narayana Rao Novel.djvu/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86

నారాయణరావు

అప్పటివర కామెతలిదండ్రు లామె కింకను ఈడు రాలేదనియే చెప్పుచుండిరి. వివాహమైనపిమ్మట బుష్పవతి యైనదని యుత్సవము జేసినారు. తక్కిన వేడుక లన్నియు జరిగి భర్తయింటి కా శోభనాంగి రెండు నెలలలో వెలుగువలె, సువాసనాలహరివలె ప్రత్యక్షమైనది.

పుష్పశీల పుష్పమే. ఆమెయందము నాగుబాము, చిరుతపులి, వజ్రముల యందమువంటిది. శిరోజములుంగరములై, దీర్ఘములై, నీలముకన్న నీలములై కటిభాగమున పచారుసేయును. వెడదలై, సోగలై పెద్దకనీనికలతో గాఢభావములొలుకు నాపె కన్నులు సమ్మోహనమంత్రములే. ఆమె సమనాసికాగ్ర మించుక పైకి తిరిగినట్లుండి వలపుదలపులు పట్టియిచ్చు చుండును. పూర్ణోష్టసుందరమగు నామెముఖ మించుక వెడదయై కాముకులకు నోరూరజేయుచుండును.

వనితాలోలుడగు సుబ్బయ్యశాస్త్రికి తిరుపతిరాయని స్వేచ్ఛాచారి సంఘమున బద్దుగైకొనుట తప్పనిసరియైనది. ఆ వనితా పుష్పవనములో బంభరుడు కాగోరినాడు. ఆత డందగాడు గాకపోయినను న్యాయస్థానమున పేర్వడిన యాతని వాదనాపటిమ కొందఱు యువతులమనసుల నాకర్షించినది.

స్వేచ్ఛాచారు లపుడప్డు సుబ్బయ్యశాస్త్రియింట నాతిధేయులగుట కలదు. కాని సుబ్బయ్యశాస్త్రి భార్యనుమాత్ర మా మూకకంట నెన్నడు బడనిచ్చినాడుకాడు. కావున నా సంఘ సభ్యురాండ్రగు వనితామణులు సుబ్బయ్య శాస్త్రిని ‘మీ పుష్పశీలకు గాలి వెలుతురు పడవు కాబోలు’ నని యెత్తిపొడిచెడివారు.

రాజేశ్వరుని మాటలును, మంచితనమును, మృదుస్వభావమును ఆతనిని సుబ్బయ్యశాస్త్రికి ప్రాణస్నేహితు నొనర్చెను. ఇంటిలో నించుక చనవు దొరకుటచే ఒకటి రెండుసారులు సుబ్బయ్య శాస్త్రి భార్య రాజేశ్వరరావుకంట బడినది. ‘పుర్దనాషీన్’ అగు పుష్పశీల ఏముహూర్త ఘటనాచమత్కృతినో యాతని కన్నులబడినది. పుల్లమ్మ గారు అద్భుత సౌందర్యవతియన్న ప్రతీతి మున్నాతడు విన్నాడు. కాని నేడు కన్నులలో తళుక్కుమని మాయమైన యా త్రిజగన్మోహినీమధురమూర్తియే ఆ పుల్లమ్మయని నమ్మజాలడయ్యెను. పుల్లమ్మ శరశ్చంద్రచంద్రికా ఖండము. తక్కు సుందరులెల్ల మిణుగురులు అతనిగుండె బ్యాండుస్వరము వాయించినది. తన భాగ్యదేవతాసాక్షాత్కార వృత్తాంతము నాతడు సుబ్బయ్య శాస్త్రి కెరుక పడనీక హృదయమున నిక్షేపించుకొన్నాడు.

సుబ్బయ్యశాస్త్రి గారియింట్లో వంటలక్క ముసలియామె. ఆయనతల్లి వేయికండ్లతో గోడలి ఘోషాను కాపాడుచుండును. ఆడవాళ్లుమాత్ర మామెను జూచుటకు బోవచ్చును. సుబ్బయ్యశాస్త్రి భార్యను బేరంటములకు పంపునపుడు గూడ ఘోషాను రక్షింపగల ‘సెడాను’ జాతి కారులో నంపును. మోటారు