పుట:Narayana Rao Novel.djvu/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రేమస్వాతంత్య్రము

85

తిరుపతిరావు గారిచుట్టును పాశ్చాత్యవిద్యా దక్షులగు (విద్యాదగ్ధులా?) పెక్కండ్రు చేరినారు. ఒకరి భార్యల నొకరు పొందవచ్చును. స్త్రీ, స్వాతంత్య్ర సంపాదనము, శిక్షాస్మృతిలో పరభార్యా సంభోగమునకు, గర్భవిచ్ఛిత్తికి నేర్పడిన శిక్షలు తొలగించుట, విడాకుల చట్టము, అన్నదమ్ములతోపాటు స్త్రీలకు బితృస్వమున భాగమొసగు చట్టము నిర్మింప జేయుట మొదలగునవి వారికి ముఖ్యాశయములు.

పరస్త్రీ సంగమము దోషమని తలంచుట యజ్ఞానవిలసితమని వారి యభిప్రాయము.

ఆ బృందముతో తిరుగు రాజేశ్వరుడు పవిత్రుడు గాడని యెవరు చెప్పగలరు? ఆత డందగాండ్రలో లెక్కగావున ఆ సమాజములోని బాలికల కతనిపై మరలు జనించుట వింతకాదు.

కాని యా సంఘములోగూడ పెక్కు వత్సరముల నుండి పరస్పరము ప్రేమించుకొనిన స్త్రీ పురుష యుగ్మము లెన్నియో కలవు. ఆ సంఘములో పూర్వసంప్రదాయానుసరణి వివాహమైనవారిలో తిరుపతిరాయడు గారొకరు. ఆయన భార్య విద్వాంసురాలు, పతిప్రాణ. భర్తగారి యాశయములు, బోధలు, చర్యలు తన కేమియు నచ్చకపోయినను సత్యవర్తనమే పరమధర్మమని తలచి, పతియానతి కెదురు చెప్పక, స్వేచ్ఛాచార సంఘములో గాఢ దీక్షాపరురాలివలె చరించుచు, ఆయన కామసంబంధము చేసికొమ్మనిన వారితో నిష్టము లేకున్నను అటులనే చేయుచుండెను.

తిరుపతిరావు గారికి వనితామానాపహరణమే పరమవ్రతము. ‘స్త్రీ‘, భోగముకొరకే జనించినదని యాతని వాదము. నతివిచిత్రమైన ప్రాణియట వనిత. ఆమె కన్నులలో నీలిమబ్బులు తేలియాడునట. ఆమె పెదవులలో తేనెవాక లున్నవట. ఆమె వక్షములో ప్రేమ యతి గంభీరమై యాకాశమువలె నగమ్యసుందరమై యుండునట. ఆమె దేహము కౌగిలింతల గోరునట. ఆమె చెక్కిళ్ళు నీరసనిదాఘతప్తున కుపశమనోషధీ కుసుమములట. ఆమె మెడ, బాహువులు, కటిప్రదేశ మూరువులు, జంఘులు, పాదములు చుంబనసౌభాగ్యమునకై పరితపించు పరమకళాప్రదేశములట.

రాజేశ్వరుని కా బృందములో నొక స్నేహితుని భార్య సౌందర్యము అయస్కాంతమైనది. ఆమె రాజమహేంద్రవరములో నొకవకీలు భార్య. సుబ్బయ్యశాస్త్రి గారు నలుబదియేండ్లయీడువాడు. ఆయనకు ముప్పది రెండవ యేట రెండవ వివాహమైనది. వివాహమైన రెండు నెలలకు భార్య కాపురమునకు వచ్చినది. ఇప్పుడామె కిరువది రెండవయేడు. ఆమె పేరు వివాహము కాక పూర్వము పుల్లమ్మయైనను, సుబ్బయ్య శాస్త్రి, గారు పుష్పశీలయని నామకరణము జేసినారు. ఆ సుగాత్రి పుట్టిల్లు రాజమహేంద్రవరమే. ఆ విద్యావతి వీరేశలింగము పాఠశాలలో అయిదవ ఫారము చదువుచుండగా వివాహమైనది.