పుట:Narayana Rao Novel.djvu/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

నారాయణరావు

భగవంతునివల్లనో, లేక ప్రకృతివల్లనో వచ్చిన ‘ఇన్‌స్టిన్‌క్ట్’ (జంతుజ్ఞానం) వల్ల జంతువులు బ్రతకడం జాతి వృద్ధిపొందడం అనేవి మాత్రమే అవి ఎరుగును. ఆ జంతుజ్ఞానంవల్ల ఇష్టమువచ్చిన తిండితినవు. ఇష్టమువచ్చినట్లు కామం తీర్చుకోవు. దేహం కాపాడుకోడానికి తిండి, జాతి వృద్ధిపొందడానికి కామం అని ఆ జంతుజ్ఞానమే వాటికి చెప్పింది. ఇష్టమువచ్చినట్లు తిండితిన్నా, కామం తీర్చుకున్నా జాతి నశిస్తుందని ఆ జంతుజ్ఞానమే చెప్పింది. అందుకనే సాధారణపు కోతులలో ఒక మగకోతి కొన్ని ఆడకోతులు ఉంటవి. లేక ఉరాంగు ఉటాంగు మొద లైనవైతే, గొరిల్లా లాంటివి అయితే, ఒక మగది ఆడది నీతిగా ఉంటవి. అలాగే సింహం, పులి, తోడేలు, ఎలుగు. అదీ కాకుండా జంతువులకు ఋతుకాలం అంటూ ఒకటి ఉన్నది. ఆ కాలంలోనే కామక్రియా నిర్వహణం జరుగుతుంది. ఇదే జంతువులలో పెళ్ళివంటిది.’

‘అయితే మన ఆవుల సంగతి, కుక్కల సంగతి ఏమిటి? ఆంబోతుకు ఈ ఆవు ఆ ఆవు అని లేదు. ఎప్పుడు ఏ ఆవు ఎదపోయి సిద్ధంగావుంటే, ఆ ఆవుతో పొర్లడానికి ఆంబోతు సిద్ధం. ఆ ఆవుకైనా ఏ ఆంబోతైనా సరే. కుక్కలలో ఒక్కొక్క ఋతుకాలంలోనే ఆడకుక్క రెండు మూడు మగ కుక్కలతో సంబంధానికి సిద్ధం. చూలు నిలవగానే మానుకుంటుంది. తన పిల్ల అయిన మగకుక్క అయినా సరే! గాడిదెలు అంతే, పందులు అంతే. ఇప్పు డే మంటావు?’

‘నువ్వు ‘మన’ అనడంలో నే జవాబంతా వచ్చింది. అయినా విపులం చేస్తాను. మనుష్యుని జీవితాల్తో కలిసిపోయినవి ఆల జాతులు, కుక్క, గాడిద, పంది, పిల్లి జాతులు. అందువల్ల చాలాభాగo వాటికి జంతుజ్ఞానము నశించి పోయింది. మనుష్యునికున్న మనస్సున్నూ లేదు. అయినా అవికూడా ఋతుకాలాన్ని మాత్రం అనుసరిస్తాయా, అనుసరించవా?’

‘సరేరా! పెళ్ళి అనే సంస్థ సంగతి కానీ.’

జంతు జీవితంలోంచి నెమ్మదిగా మనుష్యుడు తన మనోబలంవల్ల పైకి రాసాగాడు. మనస్సంబంధమైన జ్ఞానము వృద్ధిఅయినకొద్దీ జంతుజ్ఞానము నశించినది. భోజన నిద్రామైధునములు మాత్రమేకాక అనేక వాంఛలు, వాటిని సంపాదించుకోడం పెట్టుకున్నాడు. కళలన్నాడు, లలితకళ లన్నాడు, కృషి వాణిజ్యాలు, యుద్ధాలు రాజ్యాంగాలు పరసాధన యిటువంటి వ్యాపారా లనేకం కల్పించుకున్నాడు. ఆయా వ్యాపారాలలో నిరంతరసాధన చేస్తూ, అద్భుతమైన నాగరికత నిర్మించుకున్నాడు. ఆహారనిద్రా మైధునాలు తప్ప వేఱే పని లేనివాళ్లు అప్పటికీ యిప్పటికీ నువ్వనుకోగానే పశుతుల్యులుగానే వుంటారు. తన మానవత్వం సార్థకపరుచుకోడానికి ధర్మార్థాలు సాధింపదలచుకొన్న వాళ్లు పశుప్రవృత్తయిన కామానికి ఒక హద్దు ఏర్పరచుకొన్నారు. నిరంతర కామసేవ