పుట:Narayana Rao Novel.djvu/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీణ

81

‘అది పట్టుదేనా?’

‘ఆ.’

‘నిద్దట్లో నీ జుట్టు చెరుగుతుందిరా!’

‘పాపము శమించు గాక!’

‘ఏదీ చెయ్యి? పారాహుషార్!’

‘నామీద ఒక వ్యాసం రాయరా! ఒక కథ అల్లరా!’

‘నీ వొక్కడిమీదనేనా, ఆ పరకీయను కూడా కలపనా?’

‘సెబాష్! కలిపితే యిక మజా అడిగావూ!’

‘మఱి దశావస్థల్లో ప్రస్తుతావస్థయేదో చెప్ప?’

‘మీ కవిత్వాల్లో విరహావస్థ లన్నింటిమాటా నాకు తెలియదుగాని ‘ప్రళయం’ మట్టుకు తప్పేటట్లు లేదు.’

‘ఎవరికి? నాయికకా, నాయకునకా? ఆ పూర్ క్రీచరుకా? మీ మోహప్రవాహాన్ని ఆ భర్త అరికట్టడనీ, పైపెచ్చు సంతోషంతో ఓలలాడతాడనీ చెప్పావుగా! నీ వానాడు చెప్పినమాటలు తలచుకుంటే నా కిప్పటికి ఒళ్ళు జలదరిస్తున్నది. ఎంత అమానుషపు టూహ చేశావురా!’

‘ఒరేయి! ఈ విషయములో మనం యిద్దరం ఏకాభిప్రాయులం కామనిన్నీ, ఆ భావాలు మనం చర్చించుకోవడం మానివేద్దామనిన్నీ అనుకున్నాంగా?’

‘అవును. అందుకనే ఆయనమాట తలపెట్టవద్దన్నాను. కాని ఇప్పుడు నీ పెళ్ళిమాట ఎత్తావు కాబట్టి ఇప్పటికైనా ఈ హేయశృంగార ప్రబంధానికి స్వస్తి చెప్పి, పెళ్ళిమాట ఆలోచించడం ఉత్తమం.’

‘నారాయుడూ! నువ్వు చెప్పే ముసలమ్మల సిద్ధాంతాలు నాకు గిట్టవు. ఎప్పుడో ఇక్ష్వాకులనాడు పుట్టిన వివాహాచారాన్ని యీ ఇరవయ్యో శతాబ్దంలో కూడా పట్టుకు వేళ్ళాడమంటావునువ్వు. వివాహాలు లేని కాలం కూడా ఒకటి ఉండేదన్న మాట మరచిపోకు. ఏదో ప్రయోజనం కొరకు మధ్యలో కల్పించిన యీ ఆచారంతో ప్రయోజనం లేదనుకుని యిప్పుడు దాన్ని విడిచిపెట్టే వాళ్ళకు ఆక్షేపణ ఏముంది? స్త్రీ, పురుషుల ప్రేమసంబంధానికి ఇంత తంతెందుకు?

‘పెళ్ళిలేని కాలం ఒకటి ఉండేది అన్నావు. ఆ కాలం పాశ్చాత్యశాస్త్రజ్ఞుల వాదన ప్రకారం, మానవులు జంతువులలా సంచరించే రోజులు. కనక ఇప్పటి జంతువుల సంగతి విచారిస్తే ఆనాటివారి స్థితి మనకు గోచరిస్తుంది.’

‘అది సరే. నా వాదానికే వస్తున్నాను.’

‘తొందరపడకు. ఆ కాలంలో మానవజాతి అంతా ఇష్టంవచ్చిన మగవాడూ, ఇష్టమువచ్చిన ఆడదీ వాంఛ తీర్చుకోవడం, తర్వాత వాళ్ళకీ వీళ్ళకీ సంబంధం లేకుండా ఉండడం అనికదా నీ వాదన? నువ్వు అనుకునే జంతుత్వం జంతువులలో లేదు. మానవ సంబంధంలేని జంతువులలో ముఖ్యంగా లేదు.