పుట:Narayana Rao Novel.djvu/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

నారాయణరావు

లత్తుకతీర్చిన చిన్నారి పాదాలపై పరికిణి యంచులు చిందులాడ, కనక కింకిణీనూపుర ఘల్ఘలారవముతో శీతనగ స్వచ్ఛహిమశకలముపై నృత్యమొనర్చు సుమాబాల విశ్వమోహనమగు కంఠ కుహూకారములు విరియించిన ట్లయినది నారాయణరావునకు.

‘ఎటులా బ్రోతువో తెలియా

ఏకాంత రామయ్యా...!’

ఆర్తరక్షకుడగు నా శ్రీరామచంద్రమూర్తి ఎంత చక్కని ప్రభువు! ప్రోచిన నాతడే ప్రోవవలయు. శ్రీరామ నీలమేఘము భక్తమనః కేదారముల బూర్ణసస్యముల బండించుగదా ! పరాప్రకృతియగు సీతమ్మ తల్లియు, పరమాత్మయగు శ్రీరామచంద్రుడును నవ్యయులు, సత్యచేతన ప్రదాతలు ‘ప్రోచినను కబళించినను నీదే భారము ప్రభూ! రామరామా! యని రంజిల్ల నావంతు, నియతిమై రక్షింప నీది వంతు’ అని కనులు మోడ్చినాడు నారాయణరావు.

రాజేశ్వరుడు చెలికానివంక తిరిగి ‘ఏమి నారాయుడూ! నే నిన్నాళ్ళూ పెళ్ళిచేసుకోనని మానివేశాను. ఏదో సంబంధము మా నాయన తీసుకువస్తే ఆ పిల్లకూ, నాకూ ప్రేమ కుదురుతుందని నమ్మకం లేదు. మా నాయనతో ఏదో సాకులు చెప్పి తప్పించుకున్నా. మా నాయన పోయినతర్వాత నేటికి మా అమ్మ వెఱ్ఱిబలవంతం పెట్టింది. గొంతుక్కు వెలక్కాయ పడినట్లయి తర్వాత చెప్తానులే అని పారిపోయివచ్చాను’ అని పడకకుర్చీలో జేరగిలబడి కనులుమూసుకొని నారాయణరావు నడిగెను.

రాజేశ్వర రావుది పచ్చని దబ్బపండుచాయ. తెలగబిడ్డయైన నతని నందఱు బ్రాహ్మణుడే యని తలంతురు. అతడు శాకాహారి. స్వచ్ఛమగు పలుకు, మధ్యమోన్నతమై కండ పుష్టి కలిగిన శరీరము, వంకర తిరిగిన ముక్కు, సమమైన నుదురు, కామపురుషార్థపరతాస్ఫోరకములగు దీర్ఘ చక్రవాకలోచనములు. ఫ్రెంచి పద్ధతిని సగము మిగుల్చుకొన్న నల్లని మీసములు. చుట్టును జవ్వ లేని సులోచనములు ధరించి, ముంగురులు నున్నగ వెనుకకు దువ్వుకొనును. ప్రసిద్ధ సినిమా నటకు డగు రుడోల్ఫు వాలంటీనో పద్ధతి నాతడు పొడువుగా బెంచుకొను మొగచెంపలును, తీర్చినట్లున్న నల్లని కనుబొమలు నాతని మోమునకు గాంభీర్యమును పుణికియిచ్చును. ఆతడు ధరించునవి చిక్కని మీగడ తరక వంటి ఫ్రెంచిపట్టు చొక్కాలు, తెల్లటి లాగులను తొడుగును. కాళ్ళకి ఖరీదుగల లూథియానా జరీచడావు లుండును.

నారాయణరా వాతని నఖశిఖపర్యంతము జూచి చిరునవ్వునవ్వి, తన ముదుక ఖద్దరు పంచె, ఖద్దరు లాల్చీ, ఖద్దరు సేలం కండువాలను జూచుకొని నవ్వుచునే పెదవి విరుచుకొని ‘ఒరే రాజీ! నువ్వేపుడైనా అలంకారముతో లేని సమయం ఉందిరా?’ అని ప్రశ్నించెను.

‘ఇంటిదగ్గిర లబ్బీలుంగీ కట్తానురా!’