పుట:Narayana Rao Novel.djvu/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



౧౮

వీణ

ఆ సాయంత్రము విహారము సలిపివచ్చి నారాయణరా వత్తవారి మేడ చేరునప్పటికి దివ్యనాదపూరితమగు విమలగాంధర్వమున దిశల నింపుచున్న దొక బాలిక. రాజేశ్వరుడా పాట విని ‘ఎవరురా, అంత అద్భుతంగా పాడుతున్నారు’ అని అడిగినాడు.

‘ఆ! శ్రీరామయ్యగా రీమధ్య ఊళ్ళో లేరు. నేడే వచ్చారు. వారు ఫిడేలుతో పక్క వాయిద్యం వాయిస్తూ శిష్యురాలిని ఎంత విచిత్రంగా పాడిస్తారనుకొన్నావు!’

‘మీ ఆవిడే నేమిట్రా!’

‘ఆమాత్రం కనిపెట్టలేవురా! ఉండు. శ్యామ ఆలాపన జేస్తున్నారు. విను, విను. మాట్లాడకు.’

‘నాకు సంగీతమం టే తలనొప్పి.’

‘అప్పుడే నీవు ‘ఆస్పిరిను’ అంశకు వచ్చావుట్రా?’ గదిముందరి వరండాలో దీపాలు ఆర్పివేసి రాజేశ్వరరావును, తానును పడక కుర్చీలపై కూర్చుండి నారు.

తారకాకాంతులే ‘శాంతమూ లేక సౌఖ్యమూ లేదు’ అని పాడుచున్నట్లయినది. చీకటిలో గనబడని పూవుల సౌరభమే సంగీతమై విశ్వమంతయు నావరించిపోయినది. గులాబిపూల పాలగొంతుక నుండి వెడలు నా పవిత్రస్వనముతో బోల్చుటకు నారాయణరావు కీ ప్రకృతిలో నేదియు తలపునకు రాలేదు. వేణువనస్వనములా, సెలయేటి గానములా, తుమ్మెద ఝంకారములా ఇవి యేవియు దగవని యాతడు తలయూచినాడు. కోకిల గొంతులు కావచ్చు ననిపించినది.

నారాయణరావు హృదయము ఆనందపూరితమై ప్రేమపూర్ణమైనది.

‘నను పాలింపా, నడచివచ్చితీవో !’

చిట్టి శ్రీరాముడు, నీల మేఘశ్యాముడై తొనలు తిరిగిన చిఱుచేతులతో చిన్న బంగారువిల్లు పట్టుకొని, నవ్వులు వెదజల్లుచు, నడచివచ్చిన ట్లాతనికి గోచరించినది. అతని కన్నుల నీరుతిరిగినది. ఆ గొంతులో చిన్ని శ్రీరాముడే కలడు. శ్రీరామయ్య గారి కంఠములో దుష్టరాక్షస సంహారుడగు రఘువీరుడే కోదండపాణియై అనుజ సౌమిత్రులతో సాక్షాత్కరించుచున్నాడు. ప్రశాంతమగు నా సంధ్యారాగములో మిళితమగు శ్రీరామయ్యగారి కమాను కదుపులోక శారదాదేవి గళమునుండి తొలుతాడు కలికి చెలువంపు తీయ సవ్వడులు గలసి,