పుట:Narayana Rao Novel.djvu/8

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
7
"నీకు పెండ్లి అయినదా ?"


నారాయణరా వాజానుబాహుడు, అయిదడుగుల పదనొకండంగుళముల పొడవువాడు. బలసంపదకు నెలవైనవాడు. ఉజ్జ్వల శ్యామలుడు, చిన్నవై, తీక్ష్ణమైన లోచనములు. తీరై, సమమై కొంచెము పొడుగైన ముక్కు దూరస్థములగు నా కన్నుల మధ్య ప్రవహించి, ధనుస్సువలె తిరిగిపోయిన పై పెదవికి నాతిదూరమున నాగింది. అతని నోరు సుందరమై పద్మినీజాతి లలనా రత్నమునకు వన్నె తీర్చునట్టిదై యున్నది. ఆ లోపమును ఉత్తమనాయక లక్షణమగు నామ్రచిబుకము దృఢరేఖాచకితమై ధీరత్వము పుంజీభవింప జేయుచు తీర్చివేసినది.

నారాయణరావు కుడి చేతి చూపుడు వ్రేలితో నడుగు పెదవిని నొక్కుకొనుచు, బొమలు ముడిచి, విశాలఫాలము, వీచికల నిండిన పాలసముద్రమట్లయి పోవ, పరధ్యానములో మునిగిపోయినాడు.

ఉన్నట్లుండి తన్ను ఎవరో తీక్ష్ణదృష్టుల చూచుచున్నట్లు కాగా, ఆలోచనలు మరల్చుకొని ఎదుట నిలుచుండి తన్ను వింత చూపులతో గమనించు నొక పెద్దమనుష్యుని పరికించినాడు. నారాయణరావు తనలో నవ్వుకొనుచు ప్రక్కనున్న పుస్తకముల గమనించుచుండ, ఆ నూతనవ్యక్తి ‘ఆగండి’ అని చేయి యెత్తినాడు. బంగారపు పొన్ను కర్ర విలాసముగ నాడించుకొనుచు ఆ మూర్తి నారాయణరావుకడకు వచ్చెను.

‘మీ పే రేమిటండి?’

‘నారాయణరావు.’

‘ఇంటి పేరు?’

‘తటవర్తి వారు.’

‘మీ గోత్రం?’

‘కౌండిన్యస.’

‘మీకు వివాహమైందాండి?’

‘...........’

ఈ సంభాషణమంతయు ఇంగ్లీషులోనే జరిగినది.

‘అయ్యా! నారాయణరావుగారూ! నా కీ అనవసరమైన చోద్యం ఎందుకని మీ రనుకుంటున్నా రేమో! మిమ్మల్ని చూడగానే మీకు వివాహం కాలేదని నా అంతరాత్మ చెప్పింది. అందుచేత ఈ వెర్రి ప్రశ్నలు వేసినాను. వీరెవరా అని మీరు అనుకోవచ్చు. గవర్నరుగారి రాకకు వేచిఉన్న బృందంలో నేనొకణ్ణి. నన్ను తల్లాప్రగడ లక్ష్మీసుందర ప్రసాదరావు అంటారు. నేను మిమ్మల్ని అడిగిన ఆఖరి ప్రశ్నకు జవాబు ఇవ్వవలెనని నా మనవి. నా ఊహ సరియైనదా కాదా అని తెలిసికొన కుతూహలపడుతున్నాను.’