పుట:Narayana Rao Novel.djvu/78

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
77
మనుగుడుపులు

శ్రీజగ: ఇంగ్లీషు వాళ్లు కోట్లకొద్ది డబ్బు పెట్టి మన దేశంలో రైళ్ళు వేస్తే మన ప్రజలు లాభంపొందాలీ! ఇది సబబేనా?

నారా: వాళ్లు పెట్టిన పెట్టుబడి తీరగా ఏటేటా బోలెడు లాభాలను వాళ్ళెలాగూ గుంజుకుపోతున్నారు. ఇంక మనం కోరేదానిలో అన్యాయం ఏం ఉంది?

జమీం: గవర్నమెంటు, కంపెనీదగ్గిర నుంచి రైల్వేలను పుచ్చుకోవాలంటే ఉన్న యావత్తు సరకులకు రోడ్లకు పట్టాలకు ఖరీదు ఇవ్వనక్కరలేదా? ఆ డబ్బు ఇప్పుడు మనదగ్గర లేదే! ఆ డబ్బు మళ్ళీ ఇంగ్లాండే పెట్టుబడి పెట్టాలే.

నారా: డెబ్బదిఅయిదు సాలుసరి వాయిదాలమీద తీర్చడానికి ఏర్పాటు చేసికొని కదాండి?

జమీం: అవును. తిరిగి పుచ్చుకున్న తేదీకిముందు మూడుసంవత్సరాలు వచ్చిన లాభం కంపెనీ వాటాలకు పంచి, సగటుధరనుబట్టి అనగా నూరు కాసుల షేరుకు ఏ నూటయిరవయ్యనో అంచనా వేసి నూటికి నాలుగున్నర వడ్డీతో డెబ్బదిఅయిదు వాయిదాలలో తీర్చడానికే ఒప్పందం చేసుకున్నారని జ్ఞాపకం.

శ్రీజగ: ఈ రైళ్లు మనవాళ్ళు సరిగా నడపగలరండీ? మనవాళ్లే నడపడం వచ్చిందంటే రోజుకు రెండుసార్లు బోల్తాలో ఢీకొట్టటమో జరగదా!

భాస్క: అదేవిటండీ రాజాగారూ! అట్లా సెలవిస్తారు? ఎంతమంది గొప్ప ఇంజినీయర్లు, గార్డులు, డ్రైవర్లు మన వాళ్లు లేరు? స్టేషను మాస్టర్లంతా మనవాళ్లే. పోనీ ఇంగ్లీషువాళ్ళు పై ఉద్యోగాలు చేస్తున్నారా?

శ్రీజగ: ఇంగ్లీషు వాళ్లకు ఏమాత్రం తీసిపోని యూరేషియన్లు.

భాస్క: వాళ్ళుమాత్రం మన వాళ్ళు కాదండీ? మన చేతికిందికి వస్తే మాత్రం వాళ్ల, ఉద్యోగాలు తీసి వెయ్యాలని ఉందాండి?

సీతా: అయ్యో! ఈ తెలుపూ నలుపూ గాని దొరలున్నారు బాబూ, అసాధ్యులు. అసలుదొరలు నయమండీ! వీళ్ల ముందర ఆగలేం.

ఆనంద: మీరు చెప్పింది నిజమే కాని ఇప్పుడు చాలా నయమండీ శాస్త్రులు గారూ. వాళ్ళూ తాము హిందూ దేశస్థులమనీ మునిగినా తేలినా మనతోపాటేననీ గ్రహించారు.

సీతా: వాళ్లని తెల్లదొరలు రానిస్తారాండీ బాబూ?

మృత్యుం: తెల్ల దొరలు వీళ్ళు కంత్రీలు, మా కక్కర లేదు, మాకేం సంబంధం లేదంటారు. మనవాళ్లు కాదంటారు.

నారా: అలాఅనకండి. భారతీయులు ఎప్పుడూ వాళ్లని తమలో ఐక్యం చేసుకోడానికి సిద్ధంగానే ఉన్నారు, వాళ్ళే మేం తెల్లవాళ్లమని.