పుట:Narayana Rao Novel.djvu/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

నారాయణరావు

నారా: వారి ఉద్దేశం ఏమిటంటే, బ్రిటిషు ప్రభుత్వం చేతిలో రైల్వేలు ఉండడం లాభమా లేక హిందూదేశపు ప్రయివేటు కంపెనీ చేతిలో ఉండడం లాభమా అని.

శ్రీని: అవును.

నారా: బ్రిటిషు ప్రభుత్వం హిందూదేశంలో వున్నన్నాళ్లు రైల్వేలు హిందూ దేశంలో కంపెనీలకు యివ్వరు. ప్రస్తుతం హిందూ దేశంలో అంత పెద్ద పెట్టుబడి పెట్టి రైల్వేలు కొనే కంపెనీలు తయారుగా లేవు. ఇంక రైల్వేలు వెనుకటి షరతుల ప్రకారం ప్రభుత్వం చేతిలోకి ఎప్పటికైనా వస్తాయి. కొన్ని వచ్చాయి అప్పుడే.

జమీం: రైళ్ల విషయం లెక్కలన్నీ నాదగ్గర వున్నాయి. ఇంతవరకు హిందూదేశంలో వేసిన రైళ్ల వలన ప్రయివేటు ఇంగ్లీషు కంపెనీలకు, హామీ రూపంగానున్న ప్రభుత్వం వేసిన రైల్వేలకు, వడ్డీనష్టం వగైరాలమీదనున్ను గవర్నమెంటుకు చాలానష్టం వచ్చింది. (నారాయణరావు వైపుకు తిరిగి) ఆనక ఒకసారి నా స్వంతగదిలోకివస్తే ఆ లెక్కలన్నీ చూడవచ్చును.

నారా: అలాగేనండి. నాకూ ఈమధ్య ఆ లెక్కలన్నీ కావలసే వచ్చాయి.

జమీ: ఆక్సువర్తు కమిషను సంగతి ఎరుగుదువు కాదూ?

నారా: అవును ఆ రిపోర్టులు చూడాలి.

మృత్యు: ఏమిటండీ ఆ కమిషను?

జమీం: రైల్వేలు గవర్నమెంటు చేతిలో వుంటే ఎక్కువ లాభమా, కంపెనీల చేతుల్లో ఉంటే ఎక్కువ లాభమా అన్న ఈ ప్రశ్నే.

నారా: ఇతర దేశాలు ప్రస్తుతం భాగ్యవంతమైన దేశాలు. మన దేశం చాలా బీదది. పైగా పాశ్చాత్య దేశాల్లోనే ఇప్పుడు రైల్వేలు గవర్నమెంటుకు ఇచ్చి ప్రజాధీనం చెయ్యాలని రభస చేస్తున్నారు.

శ్రీని: గవర్నమెంటు స్వాధీనం అయితే లాభాల సంగతి వేరే చెప్పాలా!

నారా: చిత్తం, వస్తున్నాను. ముందు రైల్వేలు లాభదాయకాలైనవి అనే సంగతి మనం ఒప్పుకుంటే.

శ్రీని: ఒప్పుకున్నాను ప్రస్తుతం.

నారా: అయితే, దేశంలో ఏకొద్దిమందికో కంపెనీరూపంగా వచ్చే లాభం గవర్నమెంటుకు వస్తే ఆ రాబడి విలువ ఇతర పన్నులలో తగ్గించవచ్చు కదా? మఱి ప్రస్తుత ప్రభుత్వం అలా తగ్గిస్తుందాంటే, ఇది కేవలం లాభసాటి గవర్నమెంటు గనుక, యిప్పుడు ప్రజలకి ఉపయోగం లేదు. అయితే రేపు ప్రజాప్రభుత్వం, అనగా కెనడా మొదలయిన దేశాలలో ఉన్నటువంటి డొమినియను ప్రభుత్వం, వచ్చినా లేక సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చినా ఆ లాభం అంతా ప్రజలకే గాదండీ?