పుట:Narayana Rao Novel.djvu/42

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
41
దే శాం త ర్గ తు డు

రామచంద్రరావు సూర్యకాంతము భర్త. ఇంటరు పరీక్షలో గృతార్ధుడు కాలేకపోయినట్లు వార్తాపత్రికలలో బ్రచురింపబడుటతో, రామచంద్రునకు మతిపోయినది. రామచంద్రుడు భౌతిక శాస్త్రాదులలో నుద్దండుడు. అతనికి నింగ్లీషు భాష మాత్రము కొంచెము దూరపుజుట్టమైనది. పదార్ధవిజ్ఞాన, రసాయన, వృక్ష శాస్త్రములలో గ్రమముగా దొంబది, యెనుబదియాఱు, నెనుబది యొక్క గుణము లాతడు సంపాదించెను. ఇంగ్లీషులో నూటికి ముప్పది మాత్రమే వచ్చినవట. తెలు గంతయ న్యాయము గా లేదు. నలుబదియైదు గుణములు వచ్చినవి. కాబట్టి తప్పిపోయినను, మొదటితరగతి గుణములు వచ్చినవి. ఒక భాగముననే కృతార్థుడైనాడు.

నారాయణరావు కొత్తపేటలో వినినప్పుడే శాస్త్రపాఠములలో మొదటి గుణములు సముపార్జించి ఇంగ్లీషుభాషలో దప్పిపోవునని యనుమానించి లక్ష్మీపతి కది వెల్లడించినాడు. తుదకట్లే అయినది.

రామచంద్రరావు తండ్రికొక యుత్తరము వ్రాసిపెట్టి యోడ నెక్కినాడు.

‘శ్రీ బాబయ్యగారి పాదాలకు వందనాలు. మన దేశంలో నిజమైన విద్యాదీక్షకు తావు లేదు. మన దేశంలో చదువు అంతా గుమాస్తాలను తయారుచేసే చదువు. దానికి తగిన విషయ ప్రణాళికే ఏర్పరచారు పరీక్షలకు. ఇంగ్లీషులో మార్కులు వచ్చితీరాలి అని నిబంధన ఉండడం యొక్క ఉద్దేశం అది. నేను ఇంగ్లీషుపరీక్షలో నెగ్గవలసివస్తే శాస్త్రజ్ఞానానికి నీళ్ళు వదలుకోవాలి. ఈ మీ తనయుని పరిశ్రమకు పాశ్చాత్య దేశాల్లో వచ్చిన ఖ్యాతి మీ రెరిగే ఉన్నారు. మీకు నన్ను పాశ్చాత్య దేశం పంపడానికి ఇష్టము లేదాయెను. కనుక మీ పెట్టె మారుతాళంతోతీసి, అందులో ఉన్న అయిదు వందల రూపాయలనోట్లు తీసికొని ఓడ నెక్కాను. ఈ దొంగతనానికి క్షమించండి. నేను ఎల్లాగో అల్లాగు అమెరికా చేరుకుంటాను. అమెరికా హార్వర్డులో చదువుతాను. అక్కడకు తాము ధనము పంపిస్తే అదృష్టవంతుణ్ణి. లేకపోతే అక్కడ కాయకష్టపడి ఎల్లాగో సంపాదించుకొని చదువు పూర్తి చేసుకుంటా. ఈ జరిగిన విషయం అంతా నేను జాగ్రత్తగా ఆలోచించి చేసినదే. శ్రీ అమ్మ గారి పాదాలకు ఆమెనిద్రపోతుండగా నిన్న రాత్రే నమస్కరించాను. మీ యిరువురి ఆశీర్వచనం నాకుంటే లోకాలుజయించగల్ను .

నమస్కారం

విధేయుడు మీ కుమారుడు,

రామచంద్రం

ఈ యుత్తరం చదువుకొనునప్పుడు మరల కనులలో నీరుతిరిగినది భీమరాజు గారికి. తల్లి మూల బండుకొని యతికరుణముగా నేడ్చుచునే యున్నది.

అప్పుడు నారాయణరావు, లక్ష్మీపతి, భీమరాజు గారు లోనికిబోయి యామె నోదార్పబూనిరి.