పుట:Narayana Rao Novel.djvu/41

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
40
నా రా య ణ రా వు

మార్పులు వస్తున్నాయో అన్నీ చూసుకుంటూ ఉండనక్కర లేకుండా, గానుక యెద్దులాగ తిరగాలి అని సిద్ధాంత శాస్త్రాలు ఘోషించవండి. పాశ్చాత్య సిద్ధాంతాలు రోజుకోమాటు మారుతూ ఉంటాయి ఎందుచేత? అసలు సిద్ధాంత జనానికి ప్రాతిపదికమైన నిజం గోచరంచేసుకోకుండా ప్రత్యక్ష ప్రమాణమనే మాయావాదానికి దాసులై నిజాన్ని రోజుకోసారి, నిమిషానికోసారి మార్చుకోవడం వున్నదే, అది తప్పని నా మనవి. మన వాళ్లు ఆ అసలు నిజమైన తత్వం పారలౌకికదృష్టి చేత తెలిసికొని, మార్గములు మనకు ఏర్పరిచారు. వాటిలో మనకు కావలసినవి తీసికొని తక్కిన వానిని తీసి వేస్తే ఎట్లాగండీ?

శ్రీని: మీరంతా సిద్ధాంతులు. మేము కొన్ని సంగతులు తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు గ్రహాలకి కారకత్వాలు కొన్ని యిచ్చారు. రాసులకు వేరు వేరు భావాలు నిరూపించారు. అల్లా యివ్వడానికి తగిన ఆధారం ఏమిటి? శుక్రుడు స్త్రీ గ్రహం అని అంటారు. పురాణాల్లో శుక్రుడు పురుషుడుకదా. చంద్రుడు అంతే. మరేమిటంటే, ఇది అంతా నాకో విచిత్రం క్రింద ఉంటుందండి.

డిప్యూటీకలెక్టరు: అయ్యా శ్రీనివాసరావు గారూ! వచ్చిన పని పూర్తి చేసి మీ సిద్ధాంత చర్చలు ప్రారంభిస్తే బాగుంటుందేమో?

ఆనం: అదే నా మనవి.

సుబ్బా: మా సిద్ధాంతి గారికి కబురు పంపాను.

శ్రీరా: భోజనానికి ఇంటికి వస్తారట. గోపాలపురం వెళ్లారట.

సుబ్బా: సరి, ఇక నేమి తమందరూ ఈ పూట నా ఆతిథ్యం స్వీకరించి నన్ను కృతార్థుణ్ణి చేయాలి. ఎన్నడూ రానివారు యీ నిమిత్తాన దయ చేశారు.

డి. త.: నే నందఱికి ప్రయత్నం చేయించాను. క్షమించండి’ అనుటయు సుబ్బారాయుడు గారికడ వారందఱు సెలవుతీసికొని డిప్యూటీతహసీలు దారుగారింటికి వెడలిపోయినారు.

౧౦/10

దేశాంతర్గతుడు

రామచంద్రరావు కాకినాడ నుండి రంగూను వెళ్ళినాడని తెలిసి, సుబ్బారాయుడి గారి ఇంట్లో అందరు కంగారుపడిరి. సూర్యకాంతమ్మయు, జానకమ్మ గారును కళ్లనీరు నింపుకొనుచు వాపోవజొచ్చిరి. సుబ్బారాయుడు గారు లోనికి వెళ్లి నాలుగుచీవాట్లు పెట్టిరి. ఆ రోజుననే బయలుదేరి లక్ష్మీపతియు, నారాయణరావును కాకినాడ వెళ్లినారు.

కాకినాడలో రామచంద్రరావు సంగతి యంతయు దేట తెల్లమయ్యెను.