పుట:Narayana Rao Novel.djvu/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

నా రా య ణ రా వు


కూడాను. జమిందారుగారనగా రత్నాకరుడివంటి వారు. ఆ శ్రీమహాలక్ష్మీ మీ అబ్బాయిని వెదకికొంటూ వస్తే కాలొడ్డి అతిలౌక్యం చేయకండి బావగారు. కలెక్టరు గారు, తాసిల్దారుగారుకూడా యింతగా చెబుతూంటే మిరు వెనకాడ కండి’ అన్నారు. సుబ్బారాయుడుగారి కీ యనురోధ పరంపరలో ఏమి చేయడానికి తోచక, ‘నేను వారిమాట తీసి వేయాలని కాదు. అల్పుడనని జంకుతున్నాను’ అనుచు పుత్రునివంక నొక చూపు సారించిరి.

ఇంతలో మరల తహసీల్దారు గారు దొరక బుచ్చుకొని ‘మీరు అల్పులో, అధికులో ఆ విషయం మాకు వదలి పెట్టండి. విశ్వలాపురం జమిందారు గారు పేరుకే గాని ఆచార వ్యవహారాల్లో జమిందారులు కారు. కాబట్టి వారితో యెత్తు లెత్తలేమనే సంశయం మీ కక్కఱ లేదు. అయినా మీరు పుచ్చుకొనే వారే గాని, యిచ్చే వారు కానప్పుడు మీ కా భయ మక్కర లేదు’ అన్నారు.

సుబ్బా: చిత్తం, పుచ్చుకోడానికికూడా అర్హత ఉండాలి. వారు యేనుగులను, గుఱ్ఱాల్ని , దాసదాసీజనాన్ని యిస్తే వాటిని భరించడానికి కూడా శక్తి ఉండదు మావంటి వాళ్లకు.

వెంక: ఈ పేదరుపుల కేమిగానండి, బావగారు తల యెగర వేయండి. నేను అక్కగారికి చెప్పివస్తాను. రావోయి, అల్లుడూ!

అంటూ శ్రీరామమూర్తితో ఆయన జానకమ్మ గారికడ కేగెను. ఇచట సుబ్బారాయుడుగా రేమియు పాలుపోవక, ‘తమవంటివారందరూ యీ స్వల్ప కార్యంమీద నాయింటికి దయ చేయడం, నేను తమ ఆజ్ఞకు అంజాయించడం నా కెంతో కష్టంగా వుంది. జమిందారు గారు మా కుఱ్ఱవానికి తమ అమ్మాయి నిస్తామనడం ఒక యెత్తూ, దిగ్దంతులవంటి తమందఱూ, ఆనాడు సప్తర్షులు హిమవంతుడి దగ్గరకు వెళ్లినట్టుగా రాయబారం రావడం ఒక యెత్తున్నూ. ఇంతకూ, విధిసృజన వాళ్లిద్దరికీ రాసిపెట్టి ఉండడంవల్లనే మీవంటివారు పూనుకోవడం కలిగింది’ అంటూ ఉపచారవాక్యాలు చెప్పుచుండగా వెంకట్రాజు గారు తిరిగి వచ్చి, వియ్యపురాలితో బెండ్లికొడుకుతోగూడ మాటలాడి వచ్చితి ననియు, వారందఱకు నంగీకార మేననియు చెప్పి ‘ఏమంటున్నారు, మా బావ గారు? ఇక నెలాగూ యిది తప్పేది గాదండోయి, మెడలు విఱిచి అంటగట్టడమేగాని’ అనుచు మేలమాడిరి.

సుబ్బా: తథాస్తు. కానివ్వండి. ఉభయత్రా పెద్దలు, మీ అందఱి మాటకు నేనుమాత్రం ఎదురు చెప్పుతానా!

అన్నంతలో అందఱును ‘శుభం, శుభం’ అనుచు మందహాసము లొనర్చిరి. వెంటనే సీతారామాంజనేయ సోమయాజిగారొక యాశీర్వచన పనస నారంభింప, సభలో నున్న తక్కిన బ్రాహ్మణోత్తము లందుకొనిరి.

పిమ్మట వెంకట్రాజుగారు, డిప్యూటీకలెక్టరుగారితో, ‘చిత్తం, యిక