పుట:Narayana Rao Novel.djvu/37

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
36
నా రా య ణ రా వు


‘ఆలోచించక సంబంధం ఒప్పించు. నేనే దగ్గర ఉంటే! చాలా బాగుండేది.

‘షెల్లీ ఏ కోర్కెకై సంఘ బహిష్కారం పొందాడో, కీట్సు ఏ అందరాని ఫలముకై ఆశించి ఆశించి లోకాంతరాలు చేరాడో, డాంటీ ఏ ఉత్కృష్ట భావంతో ఆనందమయమైన కవిత్వం సృష్టించాడో, రొజెటీ ఏ దివ్యపథములో వసించి భగ్నమెన ఆ బ్రతుకులో తన గీతికాగుళుచ్ఛము బలి యిచ్చినాడో, ఆ మహా ప్రణయము నీకు వరమైతే హామ్లెటు లా ‘అవునా కాదా?’ అన్న సంశయంలో పడబోకు.

‘సరే. నేను రెక్కలుకట్టుకుని మా రాణీ గారితో వస్తున్నా. ఒదలి ఉండడం కష్టం గనుక బాబయ్యగారి అనుమతిమీద వచ్చి, పెళ్ళితంతులన్నీ నడిపిస్తాం. సూరీడు, కన్నతల్లి పిల్ల కాయలు నువ్వు వచ్చావని మురిసి మురిసి విరిసిపోతారు.

నేను నీయొక్కే! పరం'


రాయబారం


కలెక్టరుగారు తహసీల్దారు గారు, రాజమహేంద్రనగరము లోని పెద్ద వకీళ్లు, చెన్న పట్టణము నుండి జమీందారు గారి మేనల్లుడు ఆనందరావు గారు, పదిమందిన్నీ కిటకిటలాడుచు నవుకర్లతో, చాకర్లతో, ఒక్కసారిగా సుబ్బారాయుడు గారి ఇంటికి వచ్చినారు. సుబ్బారాయుడు గారు, చుట్టములకని వేరే కట్టియుంచిన మేడహాలులో పడక కుర్చీలమీద, పేముకుర్చీలమీద, దిండ్లకుర్చీలమీద నందఱు నధివసించినారు. కొత్తపేట డిప్యూటీ తహసీల్ దారుగారప్పుడు ‘సుబ్బారాయుడు గారూ! కలెక్టరు గారు, తహసీల్దారు గారు వీరందరూ తమతో ముఖ్యమైన పని ఉండి వచ్చారు. తమ రది కాదనక నిర్వర్తించడం మా కందరికీ చాల సంతోషప్రదమైన సంగతండి.’

సుబ్బా: చిత్తం. తమరు సెలవిస్తే నేను కాదనేవాణ్ణి ఎప్పుడూ కాదండి.

డి. కలె: తొందరపడి మాట యీయకండి. మాటయిస్తే మేము వదలం.

సుబ్బా: చిత్తం.

తహ: సెలవియ్యండి ఆనందరావు గారూ! వారు జమిందారు గారి మేనల్లుడు గారు. చెన్నపట్నంలో పెద్ద న్యాయవాదులు.

సుబ్బా: చిత్తం, నే నెరుగుదునండి.

ఆనం: శ్రీరామమూర్తి గారు మాకు పూర్వ స్నేహితులు. మా కెప్పుడు అప్పీళ్లు పంపిస్తూనే ఉంటారు. వారు పట్నంవస్తే నన్ను చూడకుండా వెళ్లరు.