పుట:Narayana Rao Novel.djvu/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఔనా, కాదా?

35


‘రెండు–నువ్వు చక్కని వ్యక్తిత్వము కలవాడివి. అందమైన వాడివి. జ్ఞానము కలిగిన మహారాజు కుమార్తెనైనా వలలో వేసికొనే వ్యక్తిత్వము ఉందని నా అభిప్రాయం.

‘మూడు–నీఉత్తరాన్ని బట్టి చూస్తే, బాలిక చాలా ఆరోగ్యవంతురాలని స్పష్టముగా ఉంది. జమిందారు గారు ఆరోగ్యవంతులు.

‘కాబట్టి నాకు జమిందారు గారి సంబంధములో ఏమి లోటు కనబడదు. నేను ఉత్తరములో ముఖ్యమైన మూడు విషయాలకన్న, అలంకారములతో అసలే రాయలేను. నా మాటలు కటువుగా ఉంటాయేమో! నేను రెండు రోజులలో బయలుదేరి వస్తాను. ఈలోగా జమిందారు గారి కుటుంబము విషయమై దరియాప్తు చేసి వస్తాను.’

ఇట్లు, నీ ప్రియమైన

రాజారావు


‘ఒకనాడు ఐరోపీయ ప్రపంచాన్ని తన పాదాక్రాంతము నొనర్చిన మహోత్కృష్టుడైన ‘క్రిక్టాన్’ ఉన్నాడు. నేడు నారాయణు డున్నాడు.

‘నీకు పాదములకడ తన సర్వస్వముతో తన్ను ధారపోసుకొనుటకు ఏ బాలయున్నూ తగదని నా మనవి.

‘నిన్నుద్వాహమై ఆ బాలిక తన బ్రతుకు సువాసనాలహరిలో లీన మొనర్చుకోవాలి.

‘చిన్నతనాన్నుంచి నేను కలల్లో తేలియాడేవాణ్ణి. సౌందర్యోపాసనామయమైన నా బ్రతుకు అందానికే దూరమైంది. నా పురుషత్వ సంపద, ఉత్కృష్ట సౌందర్య స్వరూపమైన యోషారత్నము పదముమ్రోల సమర్పింప తలచుకొన్న నా తపస్సు నిర్జలభూమిలో నూయి త్రవ్వినట్లయినది. సర్వకళా స్వరూపమైనటువంటి నా హృదయం చివికిపోయింది.

‘కుంచెకొసల్ విచిత్రలత గూర్చి మనోహరవర్ణభంగి మూర్తించి, పరీమళావృత శరీరరుచుల్ పొదివించి కంఠమున్| పంచమరాగ గీతికల పల్కితి, తేనెలు వాకలూర, మాధ్వ్యంచిత దివ్యసుందర సుధామయ భావములల్లు వెట్టుచున్.’

‘ఆ భావం భావమాత్రమే అయింది. అల్లాంటి సందర్భములో నీఅదృష్టం గమనించుకో. నీహృదయాశయమైన బాలికామణికై ఎదురు చూడవచ్చును. నువ్వే ధైర్యంగల మగవాడివైతే మహాత్మా గాంధి గారు ఉపదేశ మిచ్చి నట్లు విధవా వివాహం చేసికొని ఉందువు. విగత భర్తృక లైన బాలలు విద్యా సంపన్నులు, సుందరీమణులు పెక్కుమంది ఉన్నారు. నీకు ధైర్యము లేదు. సరేనయ్యా! ఎల్లావచ్చిందో సంబంధరూపంగా వరంలా ఒక బాలిక, విద్యా స్వరూప, కళాకోవిద, అద్భుత సౌందర్యమూర్తి! నువ్వు అదృష్టవంతుడవు.