పుట:Narayana Rao Novel.djvu/351

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

350

నారాయణరావు

ద్దీపము లమర్చినారు. నారాయణరావు మామగారికి ముందురోజుననే తంతి యిచ్చుటచే జమీందారుగారును ఆ రోజు ఉదయముననే విచ్చేసిరి.

విందు ఏ లోటును లేకుండ జరిగినది. సంగీతపు కచ్చేరీ జరుగుటకు ముందు నారాయణరావు లేచి ఇట్లు మాట్లాడెను.

‘సోదరీమణులారా! ఆర్యులారా! సహోదరులారా! మా తండ్రిగారికి చాలా జబ్బుచేసినది. అది శస్త్రవైద్యము. డాక్టరు రంగాచార్యుల వారు తమ సహజ సామర్థ్యము, నైపుణ్యము కనబరచుచు మా తండ్రిగారికి చికిత్సజేసి కుదిర్చినారు. రంగాచారిగారి ప్రేమకు, వారి ప్రతిభకు నేనును, మా తండ్రిగారును, మా చుట్టములందరు కృతజ్ఞులము. మేము యేమిచేసినను వారి ఋణము తీర్పలేము. వారి సహాయవైద్యులను, నా మిత్రుడగు వైద్యుడు రాజారావును నేను పొగడుటకు చాలను. భగవంతుడు వారిని, మిమ్ములనందరిని ఆరోగ్యము ఐశ్వర్యము నొసగి సంరక్షించుగాక’ యని ప్రార్థించుచున్నాను. (కరతాళములు)

వెంటనే రంగాచార్యులుగారు లేచి ‘నారాయణరావుగారు, తమ తండ్రిగారు ఆరోగ్యముగా నున్నారన్న సంతోషముతో, నన్ను పొగడినారు. నాలో ఏమున్నది? ఏ వైద్యుడైన ఆ పని చేయగల్గును. మాకు మా కూలియిస్తే మా శక్తికి తగినట్లు సహాయం చేస్తాము. తర్వాత దైవము. ఇంతమాత్రమునకు నేను వారి పొగడ్తకు దగను’ అని కూర్చుండెను. (కరతాళములు)

సంగీతపు కచ్చేరి అయినది. శ్రీరామయ్యగారు తమ సంగీతముచే అతిథుల నుప్పొంగజేసి ఆంధ్రదేశమున నింతటి ప్రజ్ఞావంతులున్నారా! యనిపించినారు.

నళినీదేవి తన ఆంగ్లభాషాపాండిత్య మెల్లర హృదయముల నాటజేసినది. ఆమెకు బాశ్చాత్యవిద్య నభ్యసించుచున్నానను గర్వము మెండు. ఆమె ఎప్పుడు ఇంగ్లీషుభాషయే మాటలాడును. చక చక తిరుగుటలో, రకరకముగ మాట్లాడుటలో, పక పక నగుటలో దాను గళాశాలలో జదువు బాలనని అందరకు దెల్లమగునట్లు సంచరించును.

అల్పాహారపు విందులో విసవిస పెద్దల మధ్యనుండి నడచి వెళ్ళి నారాయణుని ‘అన్నయ్యా! యెవరు సంగీతము పాడునది? శ్రీరామయ్యగారి గానకచేరి యని వ్రాసినావు, ఆయన గొప్ప పాటకుడా’ యని యడిగినది. నారాయణరావు చిరునవ్వుతో సమాధానము చెప్పి పంపించినాడు.

సరళ మితభాషిణి. ఆమె లజ్జాశీల. రోహిణి గడుసరి. ఆమె యెట్టి వారి హృదయములనైన నాకర్షించు హొయలు చూపించగలదు. పదిమంది తన్ను మెచ్చుకొనుట యామె కానందము. నళినికి బ్రేమయే తెలియదు. అందకత్తెనన్న భావముమాత్రము తన మాటలలో, ఆటలలో వ్యంజనమున దెలియజేయుచు, చిరుబాలికవలె సంచరించును. వారు మువ్వురు విందులో వనితల మధ్య కూర్చుండినారు.