పుట:Narayana Rao Novel.djvu/35

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
34
నా రా య ణ రా వు

ఇంతవరకూ హృదయములో నానందరాగములు వినుచున్న నారాయణ రావు, చిరు బొమముడిలో బావగారివంక జవాబు పరపినాడు.

లక్ష్మీ: వారంతా మంచిరోజు చూచి మామ గారితో మాట్లాడ్డానికి వస్తారనుకుంటాను. జమిందారు గారు బావంటే వెఱ్ఱిపడిపోతున్నారు.

జమిందారు గారి యాడంగులు తెరవెనుక నుండి నారాయణ రావును చూచిరనియు, దాను బాలిక నింగ్లీషుభాషలో, తెలుగులో, నితర విషయములలో బరీక్ష జేసితిననియు, లక్ష్మీపతి చెప్పగా నందఱు వినిరి. ఎవరి యాలోచనలు వారి నలముకొన్నవి.

సావిట్లో సుబ్బారాయుడు గారు పెద్ద కుమారునితో సంబంధము విషయమై రాత్రి రెండుజాములవరకు ముచ్చటించి, తమ కా సంబంధము కాకుండుటయే మంచిదని నిశ్చయించినారు. లక్ష్మీపతి దక్షిణపుగదులలో తనగది జేరినాడు. నారాయణ రావు తల్లికడ జేరి జమిందారు గారినిగుఱించి ముచ్చటించి, తండ్రిగారితోపాటు తనకై యారుబయట వేసిన మంచము పై పవ్వళించి నిదుర పోయినాడు.

నాల్గురోజులయిన వెనుక పరమేశ్వరమూర్తి వ్రాసిన లేఖయు, కాకినాడ నుండి రాజారావు వ్రాసిన లేఖయు వచ్చినవి.

‘నేను కవిత్వం వ్రాయలేను. అయినా కవిత్వం అంటే నాకు పరమ ప్రీతియన్న సంగతి తెలుసునుగదా. నువ్వు వ్రాసిన ఉత్తరం నాకు గల్గించిన సంతోషం, నేను పద్యాలు వ్రాసేవాణ్ణే అయితే నూరు పద్యాల్లో గుప్పి వేసే వాణ్ణి. లెక్కలవాణ్ణి కాబట్టి రెండుముక్కల్లో నా అభిప్రాయం తెలుపుతాను.

‘ఒకటి — జమిందారు గారి కుటుంబానికీ మీ కుటుంబానికీ పొత్తు కలవదని మనం ఊహించడం న్యాయం.

‘రెండు—జమిందారీ కుటుంబంలో నిష్కళంక మైనట్టిన్నీ, నిర్మల మైనట్టిన్నీ, ప్రేమపూరితమైన హృదయాలు ఉండడం అరుదు.

‘మూడు— పెళ్ళికుమార్తెకు కూడా నువ్వంటే ప్రేమకుదరడం కొంచెం కష్టం.

‘నాల్గు.అంత గొప్ప కుటుంబాలలో, నాగరికతలో మునిగి వున్న వాళ్ళలో ఆరోగ్యము చాల హీనముగా ఉంటుంది. నీకున్న బల సంపదకి బలహీనురాలై జన్మపొడుగునా ఏవో రోగాలతో మూల్గే బాలిక భార్య కావడం ప్రశస్తం కాదు.

‘అయినా ఈ యాపత్తులకు పూర్వపక్షాలు ఉన్నాయి. అవికూడా చాలా ముఖ్య మైనవే.

‘ఒకటి_జమీందారు గారు నీవిషయమై విపరీతమైన ప్రేమతో ఉన్నారు. తక్కినవాళ్ళెట్లా ఉన్నా, ఆయన ఒక్కడుచాలు రెండు కుటుంబాలూ సరీగ్గా ఉండడానికి. మీ కుటుంబము ఎప్పుడూ తప్పుచెయ్యదు.