పుట:Narayana Rao Novel.djvu/347

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

346

నారాయణరావు

అప్పుడే అమ్మమ్మకూడ నైనది. ఆమె ఎప్పుడూ మాట్లాడుచుండును. ఆమెకు గ్రొత్తలేదు. తన పెత్తల్లికి శిష్యురాలయి పంచీకరణపు పట్టువేయుట, అచలబ్రహ్మను గురించి మాటలాడుచు, శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులు పాడుకొనుట మొదలగునవి యన్నియు నేర్చుకొన్నది. చుట్టము లందరినీ పలుకరించి వారిని కూడగట్టుకొని యుండుట యామెకు ప్రీతి. భర్తగారు పద్ధతినియోగి, పట్టుదల మానిసియు నగుట తానును భర్తకనుగుణముగ నాచారమున పూర్ణముగ బట్టుదల చూపును.

యజ్ఞనారాయణశాస్త్రి వివాహోపనయనాది విధులు చేయించగలరు. వేదములు ఎనభైనాలుగు పన్నాలు నేర్చుకొన్నాడు. ఉర్లాము వెళ్ళి బహుమతినొందుసామర్థ్యము సంపాదించుకొన్నాడు. వారి గ్రామమంతయు బద్ధతినియోగులే. యజ్ఞనారాయణశాస్త్రి వసతిగల పెద్దసంసారి. స్వంతకమతము ఎనభై యకరాల పల్లపుమాగాణియున్నది. వారింట వంటలక్కలు పనికిరారు. కాబట్టి కోడండ్రందరు పనిచేయవలసినదే. పుట్టింటికడ పని ముట్టుకొనుట యెరుగని వెంకాయమ్మ అత్తింటికడ ‘ఏమి పనివంతురాలమ్మా’ యనిపించుకొనినది.

శారదను దగ్గరకు జేర్చుకొని ‘ఏమో, మరదలా! మీ అక్కయ్య గారికి అన్నీ శ్రద్ధగా కనుక్కుంటున్నావా, అమ్మా?’ యని ప్రశ్నించినది.

శకుం: అదేమిటండీ వదినగారూ, మా అమ్మాయి మమ్మల్ని కనుక్కుంటే ఏమి గొప్పండీ!

వెంకా: అమ్మో బ్రహ్మాస్త్రము పంపించారు. మాయింటికి కోడలయినప్పుడు మీ అమ్మాయి ఎలా అవుతుందండీ వదిన గారూ? మీకు, మాకు కనుక్కోవలసిందే శారద.

శకుం: ఎల్లాగయినా తటవర్తి వారికి జవాబులు చెప్పలేము. మీ పెద్దన్నగారు వకీలు, మీతమ్ముడు వకీలు, మీరుకూడా న్యాయంగా వకీలు గారన్న మాట. మీ వాదనకు మేము జవాబు చెప్పలేమండోయి.

జాన: అదేమిటమ్మా కోడలా, మీ ఆయన కలెక్టరు. ప్లీడర్లువచ్చి ఆయన దగ్గర వాదించవలసిందేగా. భర్త కలెక్టరయితే భార్య కలెక్టరుకాదూ? ప్లీడరెంత వాదించినా కలెక్టరుగారు కొట్టివేస్తారు.

శకుం: అత్తయ్యగారు హైకోర్టు వకీలై, వదిన గారితో కలిస్తే కలెక్టర్లు కూడా ఆర్డర్లు వేయడానికి వీలు లేదు.

అందరు ఘొల్లున నవ్వుకొన్నారు. ఇంతలో వంటయింటి పనియంతయు ముగించుకొని లక్ష్మీనరసమ్మగారుకూడ నచ్చటికివచ్చి కూర్చున్నారు. ‘ఏమిటీ మా కోడలు అంటూంది? మా చెల్లెలు హైకోర్టు వకీలా? మా అన్నగారు గవన్నేరు దగ్గర నెంబరీగా! ఆయన గవన్నేరన్న మాట. అయితే శకుంతలా గవన్నేరే. వకీలు గవన్నేరు ముందర ఏమిమాట్లాడగలడమ్మా కోడలుపిల్లా?’