పుట:Narayana Rao Novel.djvu/339

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

338

నారాయణరావు

శాలలో నక్కడక్కడ వాని నలంకరించినాడు. ‘దేహవైద్యము, హృదయవైద్యము, ఆత్మవైద్యము అన్నియు నొకేసారి జరగాలని ఇల్లాపెట్టాను- ముఖ్యముగా చివరి రెండువైద్యాలు నాకోసం లెండి’ అని రాజారావు తన స్నేహితులతో ననుచుండును.

వైద్యమునకు వలయు మందులన్నియు సంపూర్ణముగా దెప్పించి యుంచికొన్నాడు. ఏకాలమునకోగాని యవసరమురాని ఖరీదుగల మందైనను సరియే, అప్పుడు చెన్నపురికి తంతినిచ్చి తెప్పించుటకు బ్రయత్నించు వైద్యుడు ద్రోహియని యాతని వాదము. కావుననే ‘డాక్టరు రాజారావుగారి ఆస్పత్రిలోనండి, కాకినాడ గవర్నమెంటు ఆస్పత్రిలోగూడా లేని మందులున్నాయండి’ అని యాతని గూర్చి పల్లెటూళ్ల వెంబడి పేరు మ్రోగినది.

అతడు గ్రామములు సులభముగా బోవుటకై మోటారుసైకిలు (ప్రక్క బండితోసహా యున్న) బండి తెప్పించుకొన్నాడు. ఎచ్చటకుబోయిన నచ్చటకు వెంటబెట్టుకొని తిరుగుటకు ఆతనికడ రెండు పెట్టెలు, ఒక ఖద్దరుసంచియు నున్నవి. ఖద్దరు సంచి చాలా చిన్నది. ఎనిమిదంగుళములు చదరము; అందు రెండరలు. పట్టుకొనుటకుగూడా త్రాడు; మొదటి అరలో గుండెపరీక్ష జేయు యంత్రము, ఆయుర్వేదౌషధపు బొట్లములున్న యొక చిన్న దంతపుపెట్టె (పరమేశ్వరమూర్తి బహుమతి) రెండవయరలో శరీరమున మందు పొడుచుటకు సూది పిచికారి పెట్టెయు, ఒక చిన్న ఇత్తడిపెట్టెలో సూదిమందులు, ఎడ్రినాలిన్, పిట్రాటిన్ , స్టికినైను, డిజిటాలిను మందుల గాజుగొట్టములు నుండును.

పెద్దపెట్టెలలో నొక చిన్న వైద్యశాలయే. ముఖ్యములగు మందులన్నియు, తాత్కాలిక శస్త్రచికిత్సకు వలయు పరికరములు నందుండును. రెండవ పెట్టెలో పొడుపు మందులరకములన్నియు, అన్ని రకముల సూదిపిచికారీలు మొదలగు సామానంతయు నుండును.

రాజారావునకు మొదటి నెల రెండువందలు వచ్చినవి. రెండవ నెల నాలుగువందలు, మూడవ నెల నుంచి మాసమాస మయిదువందలరూకలు వచ్చుచున్నవి. నారాయణరావిచ్చిన వేయిరూకలు నాతడు తిరిగి యిచ్చివేసెను.

ఆతని పేరు కోనసీమయంతట ప్రాకిపోయినది. నెమ్మదిగ గోదావరి అద్దరిని, యిద్దరిని రాజారావును వైద్యములకై గొనిపోవ నారంభించినారు.

అంతలో ఎచ్చట నుండి వచ్చినదో మాయ మృత్యుదేవత! ఇరువురు బిడ్డలును తల్లిలేనివారైనారు.

మోహావేశమేగాని ప్రేమ యన నెట్టిదో యెఱుగని చిననాటి దినములలో భార్య కాపురమునకు వచ్చినది. ఎన్నిసార్లు వివేకానందుని చదివిన నేమి? ఎన్నిసార్లు జ్ఞానానందుని విన్న నేమి? ఆ వేదాంతము మనస్సు నుండి అంతఃకరణమున కైన నంటినదా?

రామమోహనరాయలు బోధించిననేమి, వీరేశలింగముగారు పాఠములు