పుట:Narayana Rao Novel.djvu/338

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
337
పరివర్తనము

బంగారమయ్యెను. రాజారావు రోగదశ, రోగజాతి (నిదానము) నిముషమున గుర్తెరుగుచుండెను. వైద్యముతోపాటు, రాజారావు మొదటినుండియు నుద్గ్రంథముల జదువుకొనుచు, నుత్తమ భావములలో బులకించుచు నుత్తమాశయముల కూర్చుకొనుచుండెను. తన పూర్వులు తరతరములనుండియు సముపార్జించి యిచ్చిన బ్రహ్మవిద్యామూలముచే నేమి, యాతని పూర్వకర్మచే నేమి రాజారావునకు అతీంద్రియశక్తి (ఇంట్యూషన్) యున్నది. కావుననే రోగ లక్షణము లవలీలగా గ్రహించువాడు. పడవలసిన కాలమునకు సరియైనమందు పడుచుండెను. ‘ఏమాత్ర మాయుర్ధాయమున్నా ఆయన చేతిలో రోగి బ్రతుక వలసినదేనండి. ఏమి వైద్యుడండి. ఏమి హస్తవిశేషమండి’ యని రాజారావును బొగడని కుటుంబి లే డమలాపురములోను, చుట్టుప్రక్కల గ్రామములలోను.

రాజారావు తండ్రి గారి సహాయమున, నారాయణరావు సహాయమున మూడువేల రూపాయలు పెట్టుబడి పెట్టి తన వైద్యశాల నారంభించెను. అమలాపురములో మంచియిల్లద్దెకు పుచ్చుకొని అది యంతయు శుభ్రమైన వెల్ల వేయించి మందుల బీరువాలకు, మందులు, బల్లలకు నొక గది; నిలువమందులకు, సామానులకు నొక గది; తాను రోగుల పరిశీలించుట కొకగది; తాను వ్రాసికొనుటకు, నడుము వాల్చుటకు, వైద్యసంబంధమున గాక స్నేహితులతో మాటలాడుట కొక గది; మూత్రాదుల పరీక్ష చేయుట కొకగది; శస్త్రచికిత్స కొకగది యేర్పాటు చేసెను.

నారాయణరావు దేశ యాత్రలు చేసి వచ్చినప్ప డమలాపురముపోయి వైద్యశాల యంతయు మరియు బాగుగ నమర్చెను. మందులు కలిపియిచ్చు గదిలో, రోగుల బరీక్షించు గదిలో, రోగులు కూర్చుండుగదిలో, ఆరోగ్య వంతుల బొమ్మలు–ఇంగ్లండునుండి వచ్చు ఆరోగ్యపత్రికలనుండి కత్తిరించిన వానిని - పటములు కట్టించి వ్రేలాడదీసెను.

రాజారావు కూర్చుండు గదిలో అభినవ భారతీయ చిత్రముల గొన్ని యలంకరించినాడు నారాయణరావు.

రాజారావు ఉపనిషత్తులనుంచియు, యోగసూత్రముల నుండియు, భగవద్గీతనుండియు ఉత్తేజకములు, భక్తిమధురములు నగు వాక్యములు మనోహ్లాదకరముగ వ్రాయించి, దానికి బట్టములుగట్టి వ్రేలాడదీయించినాడు తన వైద్యశాలయం దక్కడక్కడ.

కొన్ని సాధారణారోగ్యవిషయములు ముఖ్యముగా బ్రజలు గమనింప వలసిన సూత్రము లొక పెద్ద గుడ్డపై పటమువలె వ్రాయించి రోగులు మొదలగు వారు కూర్చుండుచోట గట్టించెను. మైసూరులో గంధపుజెక్కతో, విన్నాణముగ శిల్ప ముట్టిపడునట్లు చెక్కిన శ్రీకృష్ణుని వివిధ శైశవ క్రీడలు జూపు విగ్రహములు, నీకు దోచినవి అయిదారు గొనిరమ్మని నారాయణ రావునకు చెన్నపురికి వ్రాసి, నారాయణరావు వానిని బంపినవెనుక ఆతడు తన వైద్య