పుట:Narayana Rao Novel.djvu/332

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మోహధర్మము

331

ఆ యువకుడు వెనుతిరిగి యింటిగుమ్మములు దిగి వెడలిపోయినాడు.

రాజేశ్వరు డా వనిత ను జూచి ‘పుష్పం, నాకు జ్ఞానోపదేశం చేశావు. కృతజ్ఞుణ్ణి’ అని గబగబ, యా చీకటులలో కలిసిపోయినాడు. పుష్పశీల కుర్చీపై చదికిలబడినది.

అంత అనుమానరహితమనుకొన్న నిశ్చయములు ఇంత యనుమానపూరితములైనవి. తా నిం కేయాశయములపై సంఘముపై గత్తి కట్టుట? పూర్వకాలము నుండి స్త్రీ, తన ప్రకృతిలోపమువల్ల నొక పురుషునిజేరి ఆతని నాధారపరచుకొని యున్నది. అంతియ కాని తాను బానిసయై పురుషునికి లోబడియుండలేదు. అని నారాయణుడు చెప్పిన ముక్కయే నిజము కాబోలు.

రాజేశ్వరుడు అంతకంతకు దీర్ఘ విచారమున బడెను. ఆతడు ఇతికర్తవ్యతా మూఢుడై, కంటక వృక్షముల నడుమ బడిన నరునివలె బాధ నందుచుండెను. ఇది వర కాతనికున్న నిశ్చయబుద్ధి మూలమట్టముగ గదలిపోయినది. నిర్మలహృదయము మేఘావృతమైనది.

స్త్రీకి స్వాతంత్ర్యము, పురుషునకు నీర్ష్య లేకుండుట యను తమ యాశయములు తనయెడ మృగ్యమైనవి. తాను పుష్పశీల భర్తకు దృఢబుద్ధితో వ్రాసిన దెల్ల బడాయియైనది. తనకును, బుష్పశీల భర్తకును భేద మేమున్నది? పశువువలె నా మహమ్మదీయ బాలకు నట్లు కొట్టినాడేమి?

ఎట్లు భగవంతుడా! భగవంతుని నమ్మడే, యేల జ్ఞాపకమునకు వచ్చినాడు? నారాయణు డేల దాపురించి తన కా యత్కృష్టత బోధ చేసినాడు? ఒక వేళ తమ సంఘాశయములన్నియు అజ్ఞానవిలసితములా?

తనకు నీర్ష్య జనించినది.

‘అబ్బా! నా కీ గుండెల్లో బరువు. నా కేమి దారి కనబడుట లేదు. ఆలాగు పుష్పశీల నా దగ్గర నుండి వెళ్ళిపోతే ఉండగలనా? నా పుష్పశీలా! నిన్నెంత ప్రేమించాను. ఆ మహమ్మదీయుణ్ణి చంపేద్దామనే అనుకున్నాను. నారాయణుడు చెప్పినట్లు నిజముగ పుష్పశీల బ్రతుకు నేనే తగలేశానా?

‘ఓ పుష్పశీలా! పుష్పశీలా! నీ కష్టములకు నేనా కారణము? నీవు నావలన అధోగతిలో పడినావా?’ కాదు, కాదు. తాను చేసిన దంతయు మంచిదే.

ఆతని మనస్సున కేదియో నిశ్చయము కలిగినది. మోము రాతితో చెక్కినట్లయినది. దేహము బిర్రబిగిసిపోయినది. అబ్బా! యని యా నిశ్చయమును దూరమునకు ద్రోసినాడు. తొందరపడుచున్నాడేమో, ఇంకొక మార్గము లేదు. ఇదే, ఇదే! ‘నీ బ్రతుకు వృధా. నీ బతుకు వృధా!’ నారాయణుడు, పరమేశ్వరుడు, రాజారావు వాళ్ళు దేవతలు. ‘ఛా! నారాయణుని దగ్గరకు పోనా సాయంత్రము?’