పుట:Narayana Rao Novel.djvu/331

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
330
నారాయణరావు

నిశ్శబముగా నున్నది. బంగాళాచుట్టు చెట్లపై పక్షులు గూళ్ళుచేరి పాటలు పాడుచున్నవి. వేసవికాలము వచ్చుచున్నదని చూపిన వెర్రి వేడియెండ పూర్ణముగా పోయినను దేశమింకను జల్లబడలేదు.

రాజేశ్వరుడు తోటలో పని చేసికొనుచున్న సంగతిని పుష్పశీల మరచి విహారమునకై చెరువుగట్టుకు పోయినాడని యనుకొన్నది. కావుననే యందకాడగు నా మహమ్మదీయ యువకుడు రాజేశ్వరుని యింటికివచ్చి, వరండా వెనుకను మధ్యగదిలో కుర్చీపై కూర్చుని, కలలుకనుచున్న పుష్పశీలను దన హృదయానికి జేర్చుకొన్నాడు. పుష్పశీల సర్వము మరచి యా మహమ్మదీయ బాలుని అదిమి పట్టుకొని యాతని నక్కడున్న సోఫాపైకి ద్రోసి, యాతనిపై వ్రాలి యాతని నావరించినది. మేఘబాల అచలకుమారుని చుట్టినది. ఆ సమయముననే రాజేశ్వరుడు తోటలోనుండి లోనికి దొడ్డత్రోవను వచ్చినాడు.

ఎట్టయెదుట దృశ్యము తిలకించి నిశ్చేష్టుడయి యచ్చటనే నిలబడిపోయినాడు, పుష్పశీలయు, నా మహమ్మదీయ యువకుడును చటుక్కున లేచి నిలుచుండిపోయినారు. రాజేశ్వరుడు రౌద్రమూర్తియైనాడు. హుమ్మని చేయినెత్తి యా మహమ్మదీయ బాలుని శక్తి కొలది చెంపపై నొక పెట్టు పెట్టెను. ఆ యువకుడా దెబ్బ కొకకుర్చీపై పడిపోయినాడు. లేచి చొక్కాచేతులు వెనుకకులాగి, రాజేశ్వరుని మోముపై ముష్టి ఘాతము నీయబోయినాడు. రాజేశ్వరు డెక్కుడు బలవంతుడగుటచే నాతని చేయిపట్టుకొని యాపి, కోపము దిగమ్రింగి ‘క్షమించండి హుస్సేను గారూ! నేను తొందరపడ్డాను. తొందరపడుటకు కారణం ఉందని మీరే గ్రహించగలరు. ఇప్పుడు మీరింటికి వెళ్ళిపోండి’ అన్నాడు.

పుష్పశీల తెల్లబోయింది. గజగజలాడుచు భయాకులయై యచ్చట నొదిగి నిలుచున్నది.

ఆ మహమ్మదీయ యువకుడు కందిపోయిన తన యెడమ చెంపను ఎడమ చేత నొక్కి పట్టుకొని,

‘నేను వెడితే, ఆ బాలికను చంపివేస్తావేమో?’

‘రామా! నీకంత భయము ఉంటే ఆ అమ్మాయిని తీసుకువెళ్లు.’

పుష్ప: మీరు వెళ్ళండి సాహెబు గారూ.

ఆ యువకుడు రాజేశ్వరు నొకసారి, పుష్పశీల నొక సారి తీక్ష్ణముగ జూచి ‘నీ భార్య కాదుగా? ఈ మనోహరిని నా కిచ్చివేయి, నేను తీసుకుపోతాను. నేను నిక్కా కట్టుకుంటాను.’

రాజేశ్వరుడు: ‘ఏమిటి పుష్పశీలా నీ కిష్టమా?’ అని గంభీర స్వరమున నడిగెను.

‘అయితే అవుతుంది’ అని యామె యన్నది.

రాజే: అలాగా! అయితే నా అభ్యంతరంమాత్ర మేమిటి?

పుష్ప: నేను రాను. మీరు వెళ్ళండి సాహెబు గారూ.