పుట:Narayana Rao Novel.djvu/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

నా రా య ణ రా వు


బాచిగాడు ఆటలో కెవ్వుమని కేరింతలాడినాడు. తండ్రి చేతుల్లో ఎగురుట ప్రారంభించినాడు. లక్ష్మీపతి తొనలు తిరిగి పండువలె నున్న తన కుమారుని ముద్దిడుకొని సూర్యకాంతం చేతి కిచ్చినాడు.

‘బాచిగాణ్ణి నా కియ్యవూ సూరీడత్తయ్యా!’ అని శ్రీరామమూర్తి తనయ, జానకి, బాలకు నెత్తుకున్నది.

చాకలివాడును, పనికత్తెయు వేడినీళ్లు తోడగా సుబ్బారాయుడు గారు, లక్ష్మీపతి, శ్రీరామమూర్తి, నారాయణరావు స్నానములకు బోయినారు. సూర్యకాంతం అన్న గార్లకు, బావ గారికి సబ్బుబిళ్ల లందించినది. మంగలివా డొడళ్లు తోమినాడు. రమణమ్మ తెల్లని తువాలుమడత లందీయ, దుడుచుకొని, యామె యందిచ్చిన పట్టు తాపి తాను ధరించి మువ్వురు వంటవసారా నంటియున్న పడమటింటిలో యథాస్థానముల నధివసించిరి. సుబ్బారాయుడు గారు కోడ లందిచ్చిన యంగ వస్త్రము చే దడియార్చికొని, పీట పైనుంచిన మడిపంచెల జతలో నొక దాని గట్టి, సంధ్యావందనము ప్రారంభించినారు.

జపము కొంత యగుటయు, వడ్డన ప్రారంభించవచ్చునని తన మామూలు పద్ధతిని విస్తరివైపు చేయిచూపి తలయూపి నారు. జానకమ్మ గారి యక్క గారు వడ్డన ప్రారంభించి పూర్తి చేయునప్పటికి, ‘చతుస్సాగరపర్యంతం’ అని ప్రారంభించి గోత్ర ప్రవరులు పఠించి, సంధ్యావందనము ముగించిరి. అందరు నొక్క సారిగా నాపోశనములు గ్రహించినారు. భోజనములు కొంత వరకైనవి. పచ్చడి కలుపుకొనుచు సుబ్బారాయుడు గారు తమ యల్లుని దిక్కు మొగమై ‘మీరు ఆలస్యంగా వచ్చారు. బస్సు చెడిపోయిందా యేమిటి, దారిలో!’ అని సంభాషణ ప్రారంభించెను.

మామ గారన్న లక్ష్మీపతికి మిక్కిలి గౌరవము, భయము, భక్తి . అల్లుడన పరమ ప్రేమ మామగారికి.

‘కాదండి, విశ్వలాపురం జమిందారు గారు తల్లాప్రగడ లక్ష్మీసుందర ప్రసాద రావు గారు రాజమండ్రిలో ఉన్నారు...’

‘అవును, ఆయన చాలా మంచివాడు. శాసనసభలో ఎప్పుడూ రైతుల తరఫున మాట్లాడుతూ ఉంటాడు. గాంధి గారి శకం రాక మునుపు, పేరు ప్రతిష్టలతో పూజింపబడే ఆంధ్ర నాయకులలో ఆయన ఒకరు. ఆయన్ని బాగా ఎరుగుదును. జమీందారైనా నియోగులలో చాలా గౌరవంగా జీవిస్తున్న నాయకుడు.’

‘ఆయనకు వివాహం కావలసిన బాలిక ఒకర్తె ఉన్నది.’

‘ఊఁ!’

జానకమ్మ గారు దొడ్డిలో చల్ల గాలికి కూర్చుండియున్నది; యీ మాట విని లోనికి జూచినది.

‘మా చిన్న బావకు తమ కుమార్తెనిద్దామని వారికి సంకల్పం కలిగింది. వారూ మేమూ బెజవాడ ప్లాటుఫారంలో తారసిల్లాము. ఆయన నారాయణ