పుట:Narayana Rao Novel.djvu/329

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

328

నారాయణరావు

పరదారను, పరధనమును ఆశించుట పరుల హింసించుటయే యగును. కావున పాపకృత్యమని వాదించినాడు. అహింసాసూత్రము నాధారము చేసికొని నీవు నీకర్మ నడుపవలెను. సంఘము ముక్తి మార్గము నన్వేషించుటలో నెన్నియో పద్ధతుల నలవడచేసికొనును. అవి యన్నియు అహింసకు, సత్యమునకు వ్యతిరేకము గాకూడదు. కావుననే సంఘమున ధనమంతయు నందరకు సమముగా బంచవలెనని నిబంధన పెట్టుకొని దానికై పలువుర జంపుట పాపమగును. నీవు స్వచ్ఛ కర్మయోగివై, నీ ప్రేమచే సంఘప్రజ నంతను సంస్కరింపవలెను. ఆలాగుననే స్త్రీ విషయమునను. స్త్రీలకు పురుష వాంఛయు, బురుషులకు స్త్రీ వాంఛయు హద్దుమీరుట మోక్షమునకు దూరము. అది ఇంద్రియలోలత్వములో ముంచును. గాన దానికై వివాహసంస్థ నెలకొల్పి యావాంఛను జాలవరకు తగ్గించినారు. వివాహమన ప్రేమ లేకుండుట కాదుసుమా! అందు దోషము లేవైననున్న యెడల మార్పుచేయుము. అంతియకాని నీ యిష్టము వచ్చినట్లు పోరాదు. మానవునకు స్వాతంత్ర్యము మంచిచేయుట కున్నదిగాని, చెడుగొనరించు టకులేదు.

ఈరీతిగా నారాయణరావు తనకు బోధయొనరించినాడు. అది నిజమా? ఆధ్యాత్మిక పథ మొకటి యున్నదని తనకు నమ్మకము లేదు. ఈజన్మము ముగిసిన వెనుక ఆత్మలు మరల జన్మించునా? ఆ ఆత్మలు__త్రాసునకు, జూపునకును అందని ఈ ఆత్మలు__ ఆద్యంతరహితములన్న మాట కేవలము కల్పితము అని నిశ్చయము జనించును.

కాని ఆ నిశ్చయము బూర్వమెప్పుడు చలనము లేక స్థిరమై యుండునది. ఇదివర కెంద రెన్నిరీతుల వాదించినను, వానిని ఛూ ఛూ యని తోసిపుచ్చు వాడు. నే డాతనికి అనేక సందేహములు జనించినవి. తన భావములు, గురువుగారి సందేశము తప్పేమో? ఇదివరకు తన గురువు గారి మతమువంటిదే చార్వాకమతము ఉండెడిదట. రోమను కాలమున, గ్రీకు మహాసామ్రాజ్యము విచ్ఛిన్న కాలమున ప్రజల కిట్టి విపరీతబుద్ధు లుండెడివట అని నారాయణుడన్నాడు. అది నిజమా? ఇది నిజమా?

ఈ యాలోచనలతో నొకనాడు రాజేశ్వరుడు తన యింటికడకు వచ్చినాడు. ఆ మహమ్మదీయ బాలుడును, పుష్పశీలయు లోననున్నారని సేవకుడు చెప్పినాడు. ఇంటిలోనికి వెళ్ళక మండిపోవు హృదయము నుపశమింప జేసికొనుచు రాజేశ్వరుడు తన పాదము లెచటికి గొంపోవుచున్నవో యెఱుంగని యవస్థలో నిల్లువిడిచి యేగెను.

తనలో నీర్ష్య జనించినదని యాతనికి స్పష్టమై తోచినది. దృఢవ్రతుడనని తా నెంత గర్వపడుచుండెనో యంతకు తగినశాస్తియైనది. నాకళ్ళయెదుటనే స్త్రీలు చంచలచిత్త లనుమాటను పుష్పశీల నాకు ఇంత చక్కగ బోధించునని యెఱుగ నైతిని.