పుట:Narayana Rao Novel.djvu/322

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
321
ప్రేమాశయము

‘అవునమ్మా! లోకంలో ఉండే చెడుగు మంచిని తరిమేస్తుందంటావు. మామూలుదృష్టికి అల్లాగే కనబడుతుంది. కాని ఈ ప్రపంచంలో చెడుగు ఇంకా హద్దుమీరకుండా ఉన్నదంటే, మంచియొక్క ప్రాబల్యం చేతనే. చెడుగు ప్రాబల్యంగా ఉంటే యీపాటికి జగత్తుకు ప్రళయం రాదటమ్మా. మనకు ఈ ప్రకృతే అంతా బోధిస్తూఉన్నది. రాక్షసశక్తి కిరసనాయిలులో ఉన్నది. ఆవిరిలో ఉన్నది. విద్యుచ్ఛక్తిలో ఉన్నది. ఇవన్నీ కట్టుతప్పితే కాలాన్ని దగ్ధం చెయ్యగలవు. అలాగే మనుష్యునిలో ఉండే రాక్షసశక్తి కట్టుతప్పకుండా చేస్తూఉన్నది అతనిలోని మంచే సుమా! కాబట్టి చెడుగు మంచిని తరిమి వేస్తోందని ఎల్లా చెప్పగలవమ్మా?’

‘నిజమే అన్నా!’

పర: ఒరే నారాయుడూ! ఒక సంగతి ఆలోచించు. చెడుగు, మంచి ఒక్క ప్రకృతిలో నుంచేకదా వస్తాయి, అప్ప చెల్లెళ్ళవలె. ఎందుకు మంచి మన మోక్షానికి మార్గం అయింది; ‘చెడుగు’ ఎందుకు కారాదు?’

నారా: నీకు తెలియదా, నన్నడుగుతావు! పురుషుడు ప్రకృతి మాయచే దేహాత్మ భ్రమలో పడుతున్నాడు. అహంకారంలో ఉన్నన్నాళ్ళు పురుషుడు సాక్షీభూతుడగు అక్షరుని, అక్షరస్థానమందుండి పురుషోత్తముని తెలిసికోలేడు కదా! ఆ పురుషుడు, ఆ ప్రకృతి పరబ్రహ్మ స్వరూపులేకదా. కాబట్టి ప్రకృతి యొక్క గుణములలోంచి జన్మించిన మంచి చెడ్డలతో మంచి పురుషుడు తానే అక్షరబ్రహ్మమను జ్ఞానం సంపాదించుకొనుటకు మార్గం అయ్యాడు.’

రుక్మిణియు, చిన్న బాలయు క్షేమముగ నున్నారు. పరమేశ్వరునకు గొమరితయందు వెఱ్ఱిప్రేమ. ఆమెపై నెన్నియో పాటలు వ్రాసినాడు. రోహిణి దేవి వానిని చదువుమని మరియు మరియు గోరునది. పరమేశ్వరుని భావములన్నియు చిత్రములు. అనాదినుండియు ఒక సంపూర్ణ ఆత్మ ఉద్భవిస్తుందట. అది ఆ ఆదికాలంలోనే స్త్రీ పురుష మూర్తులనే రెండు ఆత్మలుగ విడివడునట. వారి జీవిత యాత్రలో నెప్పుడో యొకప్పుడు భార్యాభర్తలే కలియుదురట. ఒక్కొక్కప్పుడు ప్రాణమిత్రులైన స్త్రీ పురుషులై కలియుదురట. అట్టి జన్మలో ఒక నాడు స్త్రీ పురుషునకు మోక్షముపొందుమార్గ ముపదేశించునట. అప్పుడా జంట ఒకటై తారకమార్గము నందునట. ఇదియంతయు నిజము కాకపోయినను ఒక్కటిమాత్రము నిజమని పరమేశ్వరుడు వాదించును.

‘ఒరే నారాయుడు! పురుషుని కొక యాశయస్వరూపమయిన వనితయును, స్త్రీకి ఆశయస్వరూపుడైన పురుషుడున్ను ఉండితీరాలి. వారాచరించు దీక్షకు ఉత్సాహము, ఉత్తేజము ఇస్తూఉంటారని నేను పూర్ణంగా నమ్ముతాను. డాంటీకి బియట్రిసు ఉన్నట్లు, కీట్సుకు ఫానా ఉన్నది. నెపోలియనుకు జోసెఫైను, సంపూర్ణావతారస్వరూపమగు శ్రీకృష్ణునికి రాధ, పాండవులకు ద్రౌపది, రామునకు సీత, వివేకానందునకు నివేదిత, కాళిదాసు కాయన భార్య,