పుట:Narayana Rao Novel.djvu/318

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యాధికి మందు; ఆయువుకు మందులేదు

317

ఉండగా, మా నౌకరు పట్టుకొన్నాడు. పోలీసువాళ్ళకు అప్పగించాలనుకున్నా; నా భార్య కన్నులు విప్పి తెల్లబోయి,

‘అదేమిటండీ! మీ హృదయం గాంధీగారి బోధలు మరిచిందా! పోనీలెండి, దాన్ని వదిలేయండి. తప్పని గట్టిగా చెప్పి వదిలివేద్దాం. దాన్ని మానిపించవద్దు’ అని సన్న సన్నగా చీవాట్లు పెట్టింది. నేను వైద్యంచేసి బతికించిన అమ్మాయిభర్త ఇక్కడ పోలీసు జవాను. మా యింటిలోని దొంగతనము సంగతి తెలిసికొని, చరచర మా యింటికొచ్చి, కేసుపెడతాననీ, అనుమతి యివ్వండనీ అడిగాడు. మా ఆవిడ ఒప్పుకోలేదు. ఆనాటినుంచి ఆ పనిమనిషి నమ్మకంముద్ద అయిపోయిందోయి!’

‘అవునోయి, సూరమ్మను గూర్చి నువ్వు నాకు చెప్పడమా! నా చెల్లికన్న ఎక్కువ ప్రేమ, నా తల్లికన్న ఎక్కువ ఆదరణ చూపించేది.’

రాజారావు తన హృదయమంతయు స్నేహితు లిరువురికడ వెళ్లబోసి కొన్నాడు.

తాను వేదాంతము చదువుటయందు సర్వమూ మరచిపోవువాడు. వైద్యమునందు మునిగియుండువాడు. ఇంటిలో నేమియున్నదో ఏమిలేదో యను విచారణముతో నాతని కవసరముండునదికాదు. ఎంతమందియో చుట్టాలు వచ్చువారు. సూరమ్మ తన హృదయ మెఱిగి చరించు సుశీల. గృహలక్ష్మి. వృద్ధులగు నత్తమామలకు భక్తిమెయి పరిచర్య జరుపునది. తన భార్యయన్న హృదయమున నెంత ప్రేమయున్నను ఒక్క నాడైన తాను నిండారు ప్రేమను భార్యతో మాటలాడుకొనలేదు. ఆయమకు దన భర్తమనస్సేమి కష్టపడునో యన్న భయమే.

‘ఆమెను నా బిడ్డలకు తల్లి అయ్యేందుకు ఉపయోగించానే గాని నా హృదయము నిండారుగా ఆమెతో మాట్లాడలేదు. ఇంకోచిత్రం ఏమిటంటే; చుట్టపక్కాలకు ఎప్పుడూ పతిభక్తి బోధిస్తూ ఉండేది. భాగవతము కంఠతా! అందులోని వేదాంతార్థాలు చెప్పేదిట. నాకు తెలియదు. ఆమె చక్కని గొంతుకతో పద్యములు చదవగలదు అన్న సంగతే తెలియదు నాకు’ అని రాజారావు తలపోసి విలపించెను.

అంతకన్న అంతకన్న వారి చర్చలు వేదాంతపథముల విహరించినవి. జీవపరమాత్మల సంబంధము, జీవావతారము, పరమాత్మావతారము, జీవాత్మ పరమాత్మ సంధానము, సాంఖ్యజ్ఞానసిద్ధాంతము, యోగకర్మసిద్ధాంతము, కర్మ జ్ఞానమార్గముల సమీకరణము, పురుష ప్రకృతి, వాద బ్రహ్మవాద సమీకరణము, గీత ఎట్లుచేసెనో, గీతావాక్కు ప్రపంచములో మహాత్తమగ్రంథ మెట్లాయెనో, శ్రీకృష్ణుడెట్లు సంపూర్ణావతారమో అన్నియు చర్చించుకొన్నారు.

వేదము లిరువురు పురుషులే యన్నవి. సాంఖ్యము అనంతమగు పురుషులు, ఒక్క ప్రకృతి యన్నది. ఉపనిషత్తులొక్క బ్రహ్మమునే తెలిపినవి. గీతలో శ్రీకృష్ణుడు వాటినన్నిటిని సమన్వయము చేసినాడు.