పుట:Narayana Rao Novel.djvu/317

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
316
నారాయణరావు

‘తల్లీ! నువ్వు భూదేవతవు. మాకెప్పుడూ చాకిరీ చేసేదానవు. నా కొడుకువల్ల కాకపోయినా నీవల్ల ముక్తి పొందుదామనే అనుకున్నాను. అందరికీ తల్లోని నాలికలా ఉండేదానవు.

‘నాతల్లీ ! నాబోటి నిర్భాగ్యురాలికి నీవంటి కోడలు ఎలా దక్కుతుంది సూరమ్మతల్లీ!’ యని రాజారావుతల్లి గుండెలవియ విలపించినది.

రాజారావుకు నిరువు రాడుపిల్లలు. పెద్దపిల్ల ఆరేండ్ల బాలిక, రెండవది మొన్న పుట్టిన చంటిబిడ్డ. వీరిరువురకు మధ్య నొక యాడుపిల్ల పుట్టిపోయినది.

రాజారావు ధీరత్వముతో తన దుఃఖమంతయు దిగమ్రింగి తిరిగినాడు.

ఇంతలో నారాయణ రావు రెండవరోజుకు వచ్చిపడినాడు.

రాజారావును తన హృదయమునకు జేర్చుకొన్నాడు. అక్కడ నారాయణుడు, రాజారావు, పరమేశ్వరమూర్తి మాత్రమే యున్నారు. రాజారావు వైద్యస్నేహితు లదివరకే వెడలిపోయినారు.

రాజారావు కంటివెంబడి అశ్రుధారలు ప్రవహించినవి. నారాయణు డోదార్చినాడు.

‘నా బ్రతుకులో, నా జన్మంలో ఉత్కృష్ట భాగం మాయమైంది నారాయణా!’

‘ఓయి తెలివితక్కువా! ఎక్కడికి మాయిమైందంటావు? దేహంవదలి పోయిందంటావు. అయితే ఏం? ఆమె ఉత్తమవ్రత కావున మళ్లీ యెత్తే జన్మ, జన్మరాహిత్యం చేసుకునేందుకనే ఎత్తుతుందిరా!’

‘ఎంత సమాధానపరచుకున్నా మనసు కుదుటపడడం లేదురా.’

‘అవును. ఎంతనుకున్నా మానవమాత్రులం. ఈ మానవ జన్మలో ఎన్నో మనం చెప్పుకోగలుగుతున్నాము. అనుభవించగలుగుతున్నాం. ఈ జన్మ లోంచే మనం తరించేదికూడాను. అంతజబ్బు ఎలా చేసిందిరా, డాక్టరు ఆంజనేయులు, డాక్టరు నాగరాజుకూడా వచ్చారన్నావు. అబ్బా! అదేమిటోయి, మీరెవరూ ఏమిటో చెప్పుకోలేని జబ్బుకూడా ఉందాంట? ఇంతకు మనకు దురదృష్టం రాసిఉన్నదిలే, లేకపోతే అటువంటి విచిత్రరోగం రాదు. అదేమిటిరా పరం! కళ్ళనీళ్ళు తుడుచుకో! వట్టి బేలహృదయం నువ్వూనూ! రాజారావూ! నీ కళ్ళనీళ్ళు చూసి పరమం కూడా గంగానదిలో యమునను సంగమం చేస్తున్నాడు. మొన్ననే చూసినట్లు ఉందిరా! అప్పుడు బతికించుకున్నావు. ఆ రోజుల్లో నువ్వు చూపించిన ప్రజ్ఞ ధన్వంతరిని తలపించింది. అట్టి సుశీల, పరమసాధ్విని చూట్టం అరుదురా. దేవుడు ఎవరికీ ఉపకారం చేయడేమో! ఆ పని మనుష్యులగోల ఏమిటి? ‘మా తల్లి! మా తల్లి!’ అని ఒకటే యేడుపు.’

‘నారాయణ! అదిగో ఆ పనిచేసే మనిషి, అక్కడ కూర్చున్న వారిలో గుమ్మం దగ్గిర రెండోది, అది మా అమ్మాయి బంగారుబిళ్ళ తెంపుకొనిపోతూ