పుట:Narayana Rao Novel.djvu/316

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యాధికి మందు; ఆయువుకు మందులేదు

315

మొదలగు మందుల నిచ్చి యా గడ్డు దాటినారు. తడిగుడ్డలు పొత్తికడుపుపై వైచి వైద్యము చేసినారు. పైలక్షణము లన్నియు తగ్గినవి

గుండె బలముగా నుండుటకు డిజటాలిస్ అను మందు, లోన పేగులలో విషములు లేకుండుటకు డైమాలు, మూత్రకోశము శుభ్రముగ నుండుటకు ఎక్సమీను మొదలగునవి యిచ్చుచు నతి జాగ్రత్తగ వైద్యము చేయుచునేయుండిరి. చోప్రా మొదలగు మహానుభావులు పాశ్చాత్య వైద్యములోనికి గొనివచ్చిన ఆయుర్వేదౌషధముల నాసవముల నుపయోగించినారు.

ఇతర జబ్బులువచ్చి తగ్గుటయే కాని అసలు జ్వరము తగ్గలేదు.

రాజారావు చుట్టములలో నొకడు గొప్ప ఆయుర్వేద వైద్యుడు వచ్చి చేయిచూచి పెదవి విరిచి రాజారావుకడకు పోయి ‘ఏమి చేయదలచుకొన్నావురా, అబ్బాయి?’ అని అడిగెను.

రాజారావు ‘ఏమి చెప్పను మామయ్యా! ఈ రోజో రేపో అనుకుంటున్నాము. వ్యాధికి మందున్నది; ఆయుస్సుకు లేదు అని నా కీనాటికి దెలిసి వచ్చింది’ అనుచు నిట్టూర్పు విడిచెను.

భర్తయగు రాజారావును, తన బిడ్డలను, నితర చుట్టములను వదలి, సూరమాదేవి దివంగతురాలైనది.

భార్య బ్రతుకదని రాజారావుకు దోచినప్పుడే నారాయణరావునకు తంతినిచ్చినాడు. నారాయణరావు హైదరాబాదు వెడలి ఇంకను రాలేదు. పరమేశ్వరుడు తిరిగి హైదరాబాదుకు తంతినిచ్చి తానుతక్షణం బయలుదేరి, అమలాపురం వెడలిపోయెను. పరమేశ్వరుడు వెళ్ళిన నాలుగుగంటలకు సూరమాంబ దేహము చాలించినది.

ఆ బాలిక తలిదండ్రులు, అన్నదమ్ములు, రాజారావు తల్లిదండ్రులు వచ్చినారు. ఇల్లంతయు చుట్టాలతో నిండి గొల్లుమనిపోయినది. రాజారావు స్తబ్ధుడైపోయినాడు.

కొత్తపేట నుండి సుబ్బారాయుడు గారు, జానకమ్మగారు వచ్చినారు. శ్రీరామమూర్తి రాజారావింటికి రాని నిముషము లేదు.

ప్రాణము పోవుముందు సూరమ్మ భర్తను బిలిచి యాతనికి రెండు చేతుల నెమ్మదిగ దరికిచేర్చి నమస్కరించి, ‘పిల్లలు_ మీకు_ చెప్పనక్కర లేదు. మళ్ళీ_వివాహం _ చేసుకోండి’ అని కన్నుల మూసికొని మరల తెరచినది. అప్పుడామె మోమున పారలౌకిక కాంతి ప్రజ్వరిల్లినది. ఆమె చిరునవ్వు నవ్వుచు, ప్రక్కనే భగవద్గీత చదువుచుండిన మామగారిని చూచి, మామగారికి నమస్కరించి ‘కృష్ణా! కృష్ణా !’ యని ప్రాణము వదలినది.

ఆయమ్మ తలిదండ్రు లా శవముపై వ్రాలి రోదించిపోయినారు.