పుట:Narayana Rao Novel.djvu/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

నా రా య ణ రా వు

బొమ్మను గాంచి, పరమేశ్వరుడు వణకిపోయినాడు. అతని కంటిలో రాక్షసి బొగ్గునలక పడినట్లయినది. పంటి క్రింద నిసుక రేణువులు నమలినట్లయినది.

పరమేశ్వరమూర్తికి జిన్నతనములో వివాహమైనది. అతడెంత రసగ్రహణపారీణుడో యాతని భార్య యంత నిష్కళాహృదయ. ఆమెకు సౌందర్యమన్న నేమో తెలియదు. అలంకరించుకొనుట యంతకుమున్నే యెరుగదు. ఆమె యచ్చపుగృహిణి. గృహకృత్యము లవలీలగ నెరవేర్చును. ఉదయమున లేచినది మొదలు రాత్రి భర్తను జేరువరకు నామె యొక క్షణమైన తీరుబడి లేక మధుపమువలె బని చేయుచుండును. వంటయిల్లలికి ముగ్గులు పెట్టును. కూరలు తరగును, బియ్యము కడిగియిచ్చును. రాత్రి తానే మడికట్టుకొనును. ఆడబిడ్డ లెవరైనా వచ్చినచో వారి పిల్లలకు నన్నియు నమర్చును.

రూప రేఖావిలాసముల కామె నోచుకొనకున్నను, ఆమెలో నొక వింత యందము తొలుకాడుచుండును. ఆమె కన్ను లద్భుతములు. నిష్కపటమై శాంతిపూర్ణమగు నామెహృదయ మాకన్నులలో ప్రతిఫలించును. అవి వెడదలై నల్లనై, దీర్ఘపక్ష్మముల వితానముక్రింద బ్రేమమున నడయాడుచుండును.

ఆమె పతిప్రాణయయ్యు హావభావవిలాసములచే భర్తహృదయమును రంజింపజేయుటకై యత్నింపదు. పరమేశ్వరమూర్తి యామెను ప్రక్క పాపట తీసి కీలుజడ యల్లుకొనుమని కోరును. లేనిచో మధ్యపాపటతీసి బొంబాయిముడి ముడుచుకొమ్మని కోరును. మోమున కంగరాగము లలదుకొమ్మనును. తెల్ల చీరలు ధరింపుమనును. ‘వంగపండుచాయ వస్త్రములు రాత్రి వేళ దేహమును విచిత్రముగ శోభింపజేయును’ అని భార్యతో వాదించును.

ఆ మాటలకు రుక్మిణి చిరునవ్వు నవ్వుకొనును. అంతమాత్రమే! అతని కోర్కెల పరిపాలించుట నాటక స్త్రీలకు జెల్లును గాని సంసారులకు గాదని యామె యూహ.

పరమేశ్వరమూర్తి పిఠాపురము జేరి యింటి కేగునప్పటికి రుక్మిణి మోము ప్రఫుల్లమయినది. ఆమె నయనముల దివ్యకాంతులు ప్రసరించినవి.

తనతోగూడ గదిలోనికి వచ్చిన భార్యను కౌగిలించుకొని ముద్దిడుకొన్నాడు. అచ్చట నెవ్వరు లేకపోయినను రుక్మిణి సిగ్గుపడి ‘అబ్బా, మీ కెప్పడూ ఈలాంటి పను లేనండి’ యన్నది.

‘నా ప్రేమ నాపలేక అల్లాచేశాను. నేను రాసిన యెనిమిది ఉత్తరాలకూ నువ్వు రెండుత్తరాలు జవాబు రాస్తావు. నీది కటిక హృదయం రుక్మిణీ! మూడు నెల్లు విరహ వేదన పడ్డానే! నీ బొమ్మే నాకు దిక్కా! ఎన్నాళ్లు నీకు ప్రణయ విలాసాన్ని నేర్పినా పూర్వకాలపు పునిస్త్రీవే కదా నువ్వు!’

‘నే నేం చేయనండి! అత్తగారికి తెలుస్తుందేమోనన్న భయం. ఆ రెండుత్తరాలేనా పనిదాని చేత రహస్యంగా కవర్లు తెప్పించి రాశాను.’

‘పైగా ఆ రాతేమిటి! ఎవరికి రాసిందో తెలీదు. ఏవో రెండుముక్కలు గిలికితే ఉత్తరం అవుతుందా!’