పుట:Narayana Rao Novel.djvu/262

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

‘గురువు వెదుక్కుంటూ వస్తాడు’

261


‘ఒక్కొక్క స్వరానికి మూడు నాలుగు శ్రుతులుంటాయికదా అన్నగారూ?’

‘అవునమ్మా. కాని శ్రుతియొక్క ధ్వని అతిసూక్ష్మము. శాస్త్రవిధానాన రచితమైన యంత్రసహాయాన్ని ఆయా శ్రుతుల్ని వినగలం. అంతే. మూడు నాలుగు శ్రుతులు కలిసి వినబడిన మొత్తపుధ్వని ఒక స్వరం అవుతుంది.’

‘అయితే అన్నగారూ! మన సంగీతానికి పాశ్చాత్య సంగీతానికి ఏమిటీ తేడా అంటారు?’

‘ఏమున్నదమ్మాతల్లీ! కాకలినిషాదం ప్రతిమధ్యమము చతుశ్రుతి ధైవతములు అపశ్రుతులట. అయినా పాశ్చాత్యులు రెంటినీ ఉపయోగిస్తారు. మన వాళ్ళు ఏదో ఒకటేరాగంలో వాడ్తారు. అంటే అసలు ముఖ్యమైన కిటుకు పాశ్చాత్య సంప్రదాయంలో శ్రుతికి, అపశ్రుతి కలిగించి, ఆ అపశ్రుతికి, శ్రుతికి, సమీకరణం చేసే స్వరాలు మధ్యమధ్య రానిస్తూ రెంటికీ శ్రుతి కలిపిస్తుంటారు. అందుచేతనే వట్టి స్వరకల్పనలో భావనిర్థారణ చేస్తామంటారు.’

‘పదార్థవిజ్ఞానశాస్త్రం ప్రకారం స్వరస్వరూపం, శ్రుతిస్వరూపం మీరు బాగా చదివినారుకదా, స్వరం నుంచి స్వరం చటుక్కున గంతువేసి వెళ్ళుతుందా? లేక ప్రవహించి వెళ్ళుతుందా?’

‘పెద్దప్రశ్న అడిగినావు చెల్లీ! ఇప్పటికి ప్రసిద్ధ శాస్త్రజ్ఞులుకూడా ఆ అనుమానం నివర్తించలేకుండా ఉన్నారు. స, రి, గ, మ అని మనం స్వరములు పలుకుతాము. ‘స’ కీ ‘రి’ కీ ఉండే సంబంధం యేమిటి? ‘స’ లో నుంచి ‘రి’ వస్తూందా? ఈలాంటి అనుమానాలు. కాని నెమ్మదిగా గవాయిపద్ధతిగా పాడితే ‘స’ నుంచి ‘రి’ కి గంతువేసినట్టుగా ఉండదు. ఇంతకూ నా అభిప్రాయంలో స్వరాలకు ఒకదాని కొకటి సంబంధంలేదని, కాని సినిమాలో బొమ్మలు విడివిడిగా ఉన్నప్పటికీ, చటుక్కున తిరుగుటమూలాన్ని వెనుకటి బొమ్మయొక్క ఛాయ మనస్సులోంచి పూర్ణంగా మాయంకాకుండానే, కొత్త బొమ్మ వస్తోంది. మన దృష్టి ఒకదానిమీదనుంచి ఒకదానిమీదకు గంతువేస్తూ ఉన్నా అంతా ఒక్క బొమ్మే అయినట్లు కనబడుతుంది.

‘ఇంకా స్వరంలో ఉండే గమ్మత్తు ఏమిటంటే, ఒక స్వరంపలికి, మన గొంతుక మరొక స్వరంలోకి వచ్చేటప్పటికి, ఈ రెండు స్వరాలమధ్య కొన్ని కొన్ని అవ్యక్తస్వరాలు గర్భితమై ఉంటాయి. ఇంద్రధనుస్సు చూడు: ఊదా, నీలం, ఆకుపచ్చన, పసిమి, వంగపండుచాయ, ఎరుపు, మళ్ళీ ఊదా. అసలు రంగులు మూడు. కాని ఎరుపులోంచి నీలం పుట్టుతుందా? కాని ఎరుపునుంచి నీలానికి వచ్చేటప్పటికి ఊదా, నీలి మధ్యను ఉన్నై. నీలిలోనుంచి పసిమికి వచ్చేటప్పటికి రెంటి కలయిక ఆకుపచ్చన ఉంది. ఆ మధ్యరంగులు ముఖ్య వర్ణాల కలయికే.’