పుట:Narayana Rao Novel.djvu/261

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
260
నా రా య ణ రా వు

చిత్రలేఖనములను గూర్చి వారు మాటలాడునపుడు బేలవముగానుండును. రామచంద్రుడు మాటలాడినపు డెంత సాధారణవిషయమైనను ఏదో యద్భుతమగు లోతులు కలిగియుండును. ఏదో విచిత్రపుదృక్పథము నాతడు చూపును. ఇది యంతయు నా బాలకునిపై దనకుగల ప్రేమప్రభావమా? లేక భారతీయులలో నది సహజమా? తన శీలము చెడకుండ నీ బాలుని వలచి, వలపించి, ప్రేమ ప్రవాహ రహస్యములు గ్రహించవలయునని లియొనారా తలంచెను. రామచంద్రుని ముఖము దీక్షగా గమనించుచు నట్లనే యాలోచనానిమగ్న యగుచుండును.

రౌనా సతి: రామచంద్రా! మా దేశస్థులు హిందూదేశం అంటే పులకరింపులు పొందుతారు. ఇంగ్లీషువారి చేతుల్లోంచి మీరు తప్పించుకు వెళ్ళకూడదు అని అనుకుంటారు. కొందరికి హిందూదేశం పాడైపోతుందని భయం. కొందరికి ఇంగ్లీషువారికి నష్టం వస్తుందని భయం. చాలామంది అమెరికనులకు హిందూదేశము స్వతంత్రత సముపార్జించుకోవాలనిన్నీ, ఇప్పుడు గాంధీమహాత్ముడు మొదలిడిన యుద్యమం క్రైస్తవధర్మయుతమైనదనిన్నీ, ఆంగ్లహృదయమును జూరగొని వారికి తమ చర్యలు తప్పని తోపింపజేసి, ఆంగ్ల సామ్రాజ్యములోనో, వెలుపలనో వారితో స్నేహముగా ఉండడం ఉత్తమమని అనుకుంటున్నారు. గాంధిగారి బోధలే యీ మార్పుకు కారణం.

రౌనా: ప్రియా! ఎంత చక్కగా విపులపరచి చెప్పినావు! మా అందరి ఉద్దేశం అదే. రామచందర్! గాంధీగారి మార్గమే ఉత్తమమైనది. ఆంగ్ల పరిపాలకుల నేమాత్రము ద్వేషించక వారి ప్రాణమే మనప్రాణ మనుకొని వారి హృదయము మార్చుటకు తలచిననాడే మీరు నెగ్గిపోయెదరు.

౧౫ ( 15 )

'గురువు వెదుక్కుంటూ వస్తాడు'

నారాయణరావుకును, శ్యామసుందరీదేవికిని రానురాను స్నేహము గాఢమైనది. వీలయినప్పుడెల్ల నాత డా బాలిక గృహమునకు బోయి సంగీతముగూర్చి మాట్లాడుటయో, సంగీతము వినుటయో, వినిపించుటయో చేయుచుండును. శ్యామసుందరీదేవితో మాట్లాడినప్పుడు చెల్లెళ్ళు ముగ్గురు నెమ్మదిగా నచ్చట నుండి మాయమగువారు.

‘చెల్లీ! సంగీతములో నెన్ని స్వరములనైన కల్పించవచ్చును. కాని పాశ్చాత్యులును, మనమున్ను గూడ పన్నెండు స్వరాల్ని మాత్రం గ్రహించాము. పన్నెండింటికి మించినవి కొద్ది తేడాలుమాత్ర ముండును. కాబట్టి సర్వస్వరములు పన్నెండు స్వరాల్లోనే యిముడుతున్నాయి. తక్కినవి సూక్ష్మములు.’