పుట:Narayana Rao Novel.djvu/256

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
255
మదరాసు కాపురము

నేర్పరచి సూరీడుకు విద్య చెప్పించినాడు చిన్నన్నగారు. తాను వెళ్ళినప్పుడెల్ల నామెకు నాంగ్లభాష గరపుచుండెను. ఆమె యేగ్రంథమైన ధారాళముగ చదువ నేర్చుకొన్నది. రామచంద్రరావు వచ్చునప్పటికి సూర్యకాంతమును బ్రవేశపరీక్షకు బంపవలెనని నారాయణరావు యత్నించుచుండెను.

శారదకన్న సూరీ డొకయేడు చిన్న. రామచంద్రరావు నారాయణరావు కన్న చిన్న. సూరీడు యౌవనవతియైన నాటినుండియు నేపుగా నెదుగుచున్నది. సూరీడు మోము రాజపుత్రబాలిక మోమువలె నుండును. ఆమెకళ్ళు కాటుక కండ్లు. గంభీరమైన మోము. మోమున రేఖలు లాలిత్యమును, అంతకన్న స్ఫుటత్వమును, సుందరతను దాల్చినవి. సూరీడు మోము చూచినచో రాజ్యము లేలగల వీరాంగనలు స్ఫురించెదరు. రుద్రమదేవి, విమల, అహల్య, ఝాన్సీ లక్ష్మీబాయి, చాందిబీబీ మొదలగు వా రామె వదనాన బ్రత్యక్షమయ్యెదరు, అయినను ఆమె హృదయము, జీవితము ప్రేమచే, గరుణచే నిండి మధిత నవనీత స్నిగ్ధమై సౌందర్యార్ద్రమై యుండును.

ఆమె పెండ్లినాటినుండి రామచంద్రరావును దన జీవితమునకు కథానాయకుని జేసికొన్నది. ఆమె ప్రేమించినను, గోపించినను, సంతోషించినను, అసహ్యపడినను అన్నియు గంభీరప్రవాహమువలె ప్రవహించవలసినదే! ఆమె భావములకు లఘుత్వము లేదు. చిన్నతనమునుండి తండ్రి చెప్పిన కథలన్నియు, నామె మనమున హత్తుకొనిపోయినవి. శ్రీమతి భండారు అచ్చమాంబ గారు రచించిన ‘అబలా సచ్చరిత్రరత్నమాల’ చదువుకొన్నది. ‘భారతీ’, ‘శారద’ మొదలగు మాసపత్రికలు చదువునది. ఆమె లేతభావములలో, బాలికాహృదయములో, రూపొందిన యాశయములలో యన్న గారియందువలె దేశసేవాసక్తి తలయెత్తినది. భరతమాత పే రామెకు పుల్కరింపు. ప్రతిసభకు తల్లిదండ్రుల యనుమతిని తల్లితోడనో, యక్కగారితోడనో జనునది.

ఇంటిదగ్గర చేయనవసరము లేకున్నను పై పనుల నన్నింటిని నిముషమున జేయుచు, పుస్తకముల జదువుకొనుట యామె కిష్టము. కష్టపడి వీణ వాయించుట నేర్చుకొన్నది. దానియందు తగుమాత్రము కౌశల్య మేర్పడినది. అయినను పట్టుదలతో నేర్చుకొన్నది. ఇరువది త్యాగరాయకృతులు, హిందీ పాటలు, నండూరి సుబ్బారావు గారి యెంకిపాటలు, దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి పాటలు, అభినవాంధ్రకవిత్వ జనకుడగు గురజాడ అప్పారాయ విరచితములగు పాటలు, విశ్వనాథ సత్యనారాయణ మహాకవి పాటలు నేర్చుకొన్నది. గొంతుకలో సమమైన ఒదుగు, అత్యంతమాధుర్యమును కలదు. రెండును ఏకమై అపారమై, తేనె వాకలు కట్టును.

తన జీవితము భర్తృప్రీతిపాత్రముగ మార్చుకొనవలయుననియు, నతని హృదయ మానందమున నోలలాడించవలయుననియు దనకే తెలియని దీక్ష