పుట:Narayana Rao Novel.djvu/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

254

నా రా య ణ రా వు

దుర్భరం. ఆమె నాయింటిలోనుండ నా ప్రేమ విజృంభించిపోతూవుంటే నా మనస్సుతో యుద్ధంచేస్తూ, ఆ బాలికను ముట్టకుండ అసిధారావ్రతం చేయడం మరీ కష్టము.’ ఏది ఎట్లయినను శారద తనయింటికి రాకుండుట యుత్తమము. అట్లయినచో నా బాలికను రక్షింపవలసిన తన కర్తవ్యము నెరవేర్చుకొనుట యెట్లు? తనతో కాపురము చేయుచుండ గ్రమముగా భార్యకు దానన్న ప్రేమ కలుగదా?

వనిత యొక పురుషునిగాని, పురుషుడొక వనితను గాని ఒకసారి ప్రేమించినచో జన్మాంత మయ్యది యట్లుండవలసినదేకదా? అట్టిచో పర పురుషానురక్తయగు శారద కా ప్రేమ నశించి తనపై మరల ప్రేమ కలుగుట యెట్లు? ఒకవేళ తనపట్ల అయిష్టమే కాని, యితరునిపై నామెకు ప్రేమ లేదేమో? అట్లగుచో నా బాలికను ప్రసన్న నొనర్చుట తగునుగాని, నీ దారి నీవు చూచికొమ్మని వదలి వేయుట తనకును నామెకును హానియే. కావున తన కడ కామెను తీసికొనివచ్చుటయే కర్తవ్యమగును.

ఈ యాలోచనలతో నిదురపట్టక విద్యుద్దీపము వెలిగించుకొని, పుస్తక మేదియో చేతనుంచుకొని, ఎదుటిగోడపై పరమేశ్వరుడు చిత్రించిన యొక చిత్రఫలకముపై జూపులు నిలిపి, అన్యమనస్కుడైయున్న యన్న గారికడకు, సూర్యకాంతమువచ్చి, ‘అన్నయ్యా! ఏమిటి ఆలోచిస్తున్నావు? నాకొక్క దానికీ ఏమి తోచడంలేదు. అవును గాని, అన్నా! దబ్బున వదిన్ని తీసుకురావూ? ఇద్దరం ఎంతో స్నేహంగా ఉంటాం, అన్నయ్యా’ అన్నది. ఆ ముద్దరాలి పలుకు శ్రుతిగా గ్రహించి నారాయణరావు చెల్లెలిని దగ్గరకు దీసికొని, యామె కన్నుల కనుంగొని ‘సూరీడూ! నీ కడుపంతా ప్రేమమ్మాతల్లీ! రామచంద్రరా వదృష్టవంతుడు’ అనెను. సూర్యకాంతం నవ్వుకొనుచు ప్రక్కగ నిలుచున్నది. ఇంతలో నామె నగుమోమునందు విచార మేఘములవరించినవి. కళ్ళనీరు తిరిగినది.

‘తల్లీ! రామచంద్రరా వెప్పటికప్పుడు జాబు రాస్తున్నాడా లేదా? మా అందరికన్నా విద్యావంతుడూ, ప్రయోజకుడూ అయి ఇంకో ఆరు నెలలకివచ్చి వాలుతాడమ్మా!’ అని ముద్దుచెల్లెలి నూరార్చెను.

నారాయణుడు సూర్యకాంతమున కెప్పటికప్పుడు రామచంద్రుని కబుర్లు చెప్పుచు, నాతని కామెచే నుత్తరములు వ్రాయించుచు, నామెకు ధైర్యము గొలుపుచుండెను. నారాయణరావు కోర్కెవలన రామచంద్రరావు తన ఛాయాచిత్రములు, నాలుగునెలల కొకటి తీయించుకొని పంపుచుండెను. సూరీడు అనేకవిధముల దీయించుకొన్న తన ఛాయాచిత్రము లాతనికి బంపుచుండును.

పాశ్చాత్యవిద్యాపండితుడై, పడమటిదేశములనుండి వచ్చినవాని భార్య పాశ్చాత్య విద్యలలో బ్రవీణురాలు కావలయునని, కొత్తపేటలో నొకగురువు