పుట:Narayana Rao Novel.djvu/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

250

నా రా య ణ రా వు


చంటిపిల్లవాడు క్షేమముగ నున్నాడు. జ్వరము నూటఅయిదువరకు వచ్చుచుండుటచే రాజారావు తడిగుడ్డలు పొత్తికడుపుమీద వేయించెను. అత్తగారు వాతముచేయునేమో యని భయపడుచుండెను.

నాలుగురోజులలో జ్వరం నెమ్మదించినది. నెమ్మదించిన వెనుక రెండు రోజులుండి రాజారావు పథ్యము పెట్టించినాడు. నారాయణరావా ఆరు రోజులు మిత్రునిదగ్గరనే యుండి, అతనితో గ్రంథకాలక్షేపము చేయుచు, నాతనికి రెండవ ప్రాణమువలె నుండి తర్వాత కొత్తపేట వచ్చి చేరెను. పరమేశ్వరాదులు వెడలిపోయిరి.

కొత్తపేట వచ్చునప్పటికి హైదరాబాదునుండి రాజేశ్వరరావు వ్రాసిన యుత్తరము వచ్చినది.

‘నేనేమి చేసేది, నారాయణా! నాకూ మతిపోయింది. ప్రపంచంలో ప్రేమ లేదనుకున్నాను. స్త్రీ కీ, పురుషుడికీ ఒకరి దేహంమీద ఒకళ్ళకు కోర్కె కలగడమే ప్రేమ అనుకున్నా, ఇప్పడు నా సంగతి చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తూంది. నేను ఇదివరకు చక్కని బాలికలతో స్నేహంచేసి వారి మనస్సులు చూరగొన్నానుగాని, ఇదేమిటో నాకర్థం కాలేదురా.

‘అల్లా ఉంటూ ఉండగా, ఇక పుష్పశీలాదేవికి నేనంటే పిచ్చే! నిన్ను వదిలి ఒక్క నిముషం అన్నా ఉండలేను, నాకీ భర్త వద్దు’ అని మొదలు పెట్టింది. మొదట భర్తకావాలి, నేనూ కావాలి అన్నది. శ్రుతి మించి రాగాన్ని పడింది. ఇద్దరము ఇక విడిగా ఉండడం పడలేదు. కాబట్టి బయలు దేరివచ్చి ఈ హైదరాబాదులో మమ్మెవరూ పట్టుకోలేని మేడలో ఉన్నాము. మేమే నిజమయిన భార్యాభర్తలము. నీ స్నేహము వదలుకోలేను. నా యీ భార్యనూ వదలుకోలేను. నీ సదభిప్రాయం నాకు ఉండాలి. నీ కొక్కడికే నా అడ్రసు ఇస్తున్నాను. నాకు అవసరం వచ్చినప్పుడు వేయి రూపాయలవరకు నువ్వు ధనం సప్లయి చేయవలసి ఉంటుంది.

‘మా ఆనందం ఎవరికి కలుగుతుంది? నువ్వు నా మాట విను. శ్యామసుందరి నువ్వంటే ప్రాణం ఇస్తుంది. నువ్వు దేశాలు తిరిగినన్నాళ్లు నిన్ను గూర్చి నీ స్నేహితుల్ని ఎంత వాకబుచేసింది! ఇంక ఊరుకోకు.

‘పుష్పశీలా, నేనూ కలలోగూడ ననుభవించని మహదానందంలో ఓల లాడుతున్నాము. నేను హైదరాబాదు వచ్చేటప్పడు పదివేలరూపాయలు వసూలుచేసి తెచ్చుకున్నాను.

‘రెండు, మూడు సంవత్సరాలు యీ ఆనందంలో మునిగి తన్మయుడనైతేనే గాని నాకు తృప్తిఅవుతుందని తోచదు. అంతవరకూ ఇంక యేమి తల పెట్టను. ఆవల! తృప్తి అప్పటికీ తీరదూ, యెంతకాలమో అంతే.