పుట:Narayana Rao Novel.djvu/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నారాయణరావు సాహసకృత్యములు

249

ఆ రాత్రి తానును తన చిన్నక్కగారును గది నలంకరించినారు. శిల్పహృదయముకల నారాయణరావు చెల్లెళ్ళ మనిపించుకొన్నారు.

మనస్సులో గుబగుబమను భయముతో శారద యాడుబిడ్డలచే దల దువ్వించుకొని, తోటలోని పూవుల ముడిపించుకొన్నది. ఆ రాత్రి గదిలోకి బోవుట కామెకు గుండె దడదడమనుచునేయున్నది. కాని భర్తపై నంతరాంతరముల నెచ్చటనో కొంచెము కరుణ జనించినది. నారాయణరావు పదునొకండు గంటలకు వచ్చి పక్కపై పండుకొన్నాడు. శారదవచ్చి యక్కడున్న సోఫా నానుకుని నిలుచుండి భర్తను వాలుచూపులతో చూచినది. సూర్యకాంతము వర్ణించిన మహాభాగుడు, వీరోత్తముడు ఎదుట మంచముపై కరుణార్ద్రమూర్తియై వాలిపోవుట చూచి విచారముతో నా బాలిక కంపించినది. స్త్రీ పురుషసంపర్కము లేనిచో యేదైన కబురులు చెప్పుచు కూర్చుండిన సంతోషమగునేమో?

దేశయాత్రా విశేషముల నుపన్యసించు నా సభలో తనభర్త మహాప్రవాహము వరదలు కట్టించి, వాగ్ధార నామెను విచిత్రానందపూర్ణను జేసినది. భర్త స్నేహితుడగు పరమేశ్వరమూర్తిగారు ఎంత మధురముగ, గంభీరముగ మాట్లాడినారు! మనదేశమున నిన్ని వింతలుండునా? అవి ఎరింగి, అట్టి దివ్య ప్రదేశములకు బోవుటయు ఉత్తమ ప్రజ్ఞయే!

ఉపన్యసించునపుడు దివ్యమూర్తివలె, ఆయా కాలముల దేశమున చరించిన మహోత్తమ పురుషునివలె శారదకు నారాయణరావు దర్శన మిచ్చినట్లయింది.

ఆ సోఫాలో పడుకొని యాలోచించుకొనుచు నామె యట్లనే నిదుర కూరినది.

మరునాడు శారదయు, జమీందారుగారును, జమీందారిణియు, జమీందారుగారి యప్పగారును రాణ్మహేంద్రవరము వెడలిపోయిరి.

నారాయణరావు, రాజారావు భార్య పుట్టింటి గ్రామమగు రామచంద్రపురము బోయినాడు.

రాజారావునకు నిరువురు సంతానము. ఒక కొమరితయు, నొక కుమారుడును జనించినారు. రాజారావు భార్య సూరమ్మ మంచి సౌందర్యవతి. నెమ్మదిగల యువతి. అందరకు తలలోని నాలుక. అత్తమామల ప్రాణము, భర్తహృదయము సంపూర్ణముగ గుర్తెరిగి, అద్దానిని చూరగొనిన పతివ్రతా శిరోమణి.

రాజారా వమలాపురము నుండి రామచంద్రపురం వెళ్ళినాడు, నారాయణరావు రామచంద్రపురములో మిత్రుని గలిసినాడు.

సూరమ్మ నీళ్లాడిన తర్వాత రెండవరోజునుండి జ్వరము వచ్చుచున్నదట. మలేరియాకు, బాలింతజ్వరమునకు, రాజారావు ఇంజక్షను లిచ్చినాడు.