పుట:Narayana Rao Novel.djvu/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

248

నా రా య ణ రా వు

తనంలో భర్తనుకోల్పోయిన యొక నిర్భాగ్యవనితను దనతో జెన్నపట్టణమునకు దీసికొనిబోవ నిశ్చయించినాడు. ఆమె ఉండి గ్రామములో నున్నది. సూర్యకాంతముగూడ చెన్నపట్టణము వచ్చెదనన్నది.

సూర్యకాంతమున కే కారణముననో శారదా నారాయణరావుల సంసార ప్రవాహము పుట్టకమునుపే నశించినసంగతి గోచరించినది. ఆమె కన్నగారి యెడగల ప్రేమబలమే యామె కా సంగతి గోచరింపజేసినది.

కావున శారద కాశీసంతర్పణకై కొత్తపేట వచ్చినప్పు డామెతో యథాలాపముగా జెప్పిన ట్లన్నగారి యద్భుతచర్యలు కొన్ని చెప్పినది. రాజమహేంద్రవరములో గోదావరిలో నిరువురు కాలేజీ విద్యార్థు లీతకు వెళ్ళినారట. నారాయణరావు గజీతగాడు. ఆ పరిసరములనే ఆత డీదులాడుచుండెను. ఇంతలో కాలేజీ విద్యార్థులలో నొకరు ఈదలేక మునిగిపోవుచు నొక్క కేక వేసెనట. నారాయణరావా కేక విని రెండు బారులలో నచ్చటకు నీదుకొనిపోయి, మునిగి యాబాలుని పట్టి, పైకితేల్చి నిముషంలో నొడ్డునకు తెచ్చి చేర్చెనట. ఆబాలుని పొట్టనొక్కి నీరుసడల్చి, యూపిరియాడునట్లు వైద్యము సల్పి, చలి మంట వేయించి, యా బాలుని నెత్తుకొని, రెండునిముషములలో నిన్నీసుపేటలో వైద్యముచేయు నొక వైద్యునియింటికి గొనివచ్చెనట. ఆ బాలుడు బ్రతికినాడు.

వేరొక పర్యాయము చెన్నపట్టణములో నొక పిల్లవాడు, ‘రైలు వచ్చుచున్నది పోవల’దని యందరు మందలించుచున్నను వినక పట్టాలు దాటు చుండ రైలువచ్చిపడినది. ఆ బాలుడు రైలు కింద పడిపోవువాడే కాని, ఆ చెంతనేయున్న నారాయణరా వొక్క అడుగున నురికి, ఆ బాలుని ఎత్తి యావలకు హనుమంతునివలె నొక్కగంతువేసెనట. లేనిచో నిద్దరును రైలుకింద పడి ముక్కలు ముక్కలయిపోయియుండువారే!

కొత్తపేటలో నొక నూతిలో ఒక యావు పడిపోయినదట. దాని నేవిధముగ దీసినను నడుము విరిగిపోవలసినదే, అది పోట్లావగుటవలన నెవ్వరు నూతిలో దిగుటకు సాహసించలేదు. నారాయణరావు చొరవచేసి దిగి, యడుగునుంచి తాళ్ళుపోనిచ్చి ముందుకాళ్ళదగ్గర వెనుక కాళ్లదగ్గర నడుముకు బగ్గములుకట్టి, పైకి తాళ్ళందిచ్చి యడుగునుండి సహాయము చేయుచు, ఆవును లాగివేసినాడట.

అన్నగారి సాహసకృత్యము లిట్టివెన్నియో శారదకు సూర్యకాంతము చెప్పినది.

‘వదినా! మా అన్నయ్య పూర్వం మనంవినే కథల్లో ఉండే రాజకుమారుడివంటివాడు. ఎంతమందికి సహాయం చేశాడు! మా నాన్నగారికి ఉంది ఎంతో బలం. మా నాన్న పోలికే మా అన్న. ఒకమాటు గోదావరి పొంగి ఒక ఊరు కొట్టుకుపోతే అందులో ఒక ముసలమ్మమాత్రం ఒక గుడిసెలో చిక్కడింది. పడవలు లేవు. గుడిసె మునిగేటట్లు ఉంది. మా నాన్న ఈదుకు పోయి ఆ ముసలమ్మనిబట్టి, నాలుగుమైళ్ళ దిగువకు గట్టుకు చేర్చాడట.’