పుట:Narayana Rao Novel.djvu/248

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నారాయణరావు సాహసకృత్యములు

247

ఔత్తరాహు లావెనుక వచ్చెదరు. వంగ, మహారాష్ట్ర, ఆంధ్ర, కన్నడ దేశముల వారిని తర్వాత చెప్పవలె. అరవదేశం, మళయాళదేశం వారు తర్వాత, ఒరియావా రాఖరున వచ్చెదరు. పిండివంటలలో దక్షిణాదివారు, గుజరాత్‌వారు, కన్నడులు మొదట. తర్వాత వంగదేశస్థులు, ఔత్తరాహులు. తర్వాత మళయాళీలు, తెలుగువారు. ఆఖరున ఒరియావారు. వంటకములలో ఆంధ్రులు ప్రథములు.

ఆచారము తెలుగువారి కెక్కువ. స్నానము చేయవలె, ఆరోజున ఆర వేసినబట్టి యుండవలెను. ఒకసారి మయిలపడిన మరల స్నానము చేయవలెను. మరల ఆరవేసినబట్ట కట్టవలెను. విడిచిన వస్త్రము మయిలపడును. తక్కిన అన్ని దేశములలో నిన్న ఆరవేసినబట్ట నేడు పనికివచ్చును. ఒకసారి స్నానము చేసి మడిబట్ట కట్టుకున్న యెడల మరల మరల మయిలపడుట యుండదు.

దాక్షిణాత్యులకు, మళయాళులకు, ఆంధ్రులకు, కన్నడులకు, ఔత్తరాహులకు దృష్టిదోషమున్నది. మహారాష్ట్ర, ఘూర్జర, కాశ్మీర దేశస్థులకు పంక్తిదోషముమాత్రమే.

ఆంధ్రులు, దాక్షిణాత్య, మళయాళ, మహారాష్ట్ర, కన్నడ, ఔత్తరాహ ఘూర్జర బ్రాహ్మణులు మాంసాదులు తినరు. వంగ, ఓడ్ర, కాశ్మీర, సారస్వత బ్రాహ్మణులు మత్స్యములు భక్షించెదరు. మాంసమును ఒక్కొక్కప్పుడు భక్షింతురు.

ఆయా విశేషము లుపన్యసించుట పూర్తి యగుటతోడనే యధ్యక్షులు, నారాయణరావు, పరమేశ్వరమూర్తి మొదలగువారు దేశయాత్రలకు బోయి, జ్ఞానము సముపార్జించి, ప్రజలకు తెలియజెప్పుట యత్యుత్కృష్టమగు కార్యమని వచించి సభ ముగించెను. అందరకు కృతజ్ఞతాపూర్వక నమస్కృతులు కార్యదర్శి సమర్పించినాడు.


౧౨ ( 12 )

నారాయణరావు సాహసకృత్యములు

రాజేశ్వరరావు, సుబ్బయ్యశాస్త్రిగారి భార్యతో నెచటికేని పోయెనను వార్తయు, నమలాపురములో రాజారావుభార్యకు చాల జబ్బుగానున్నదను వార్తయు రెండు నొకేసారి నారాయణరావుకు గొత్తపేట చేరినవి. స్నేహితులందరు వెడలిపోయిరి. చుట్టము లందరు వెడలిపోయిరి. నారాయణరావు చెన్నపట్టణమున గాపురముపెట్టుటకు నిశ్చయించెను.

సుబ్బారాయుడుగారు కుమారునిమాట కడ్డముపెట్టరు. ఇరువురుపుత్రులు నింటికడనుండకుండ వెడలిపోవుట ఆయనకుగాని, జానకమ్మగారికిగాని యెంత మాత్ర మిష్టములేదు. అయినను దామాబాలుని యిష్టమునకు వ్యతిరేకము చెప్పలేక నిట్టూర్చి యూరకుండిరి. నారాయణరావు తన పెత్తల్లి కూతురు, చిన్న