పుట:Narayana Rao Novel.djvu/237

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
236
నా రా య ణ రా వు

బెజవాడమీదుగా ఇళ్ళకు చేరుకోవడంట. ఈ యాత్రలన్నీ రెండు నెలలు పట్టుతవట. మనం అంతవరకూ ఉండలేకపోతే అజంతా ఎల్లోరాలన్నా చూచి వెళ్ళిపోవచ్చునట.

నటరాజన్: నన్నర్జంటుగా రమ్మనిదా తంతి యిస్తుడు ఆలం! ఎందుకుదా అని వస్తును. తీరా చూస్తే దీనికిదా. రాజేశ్వర్! నువ్వుకూడా బయల్దేరు మరి.

రాజే: నేను నిజం చెప్పాలి. మా యిల్లువదలి చాలారోజులయింది. మా అమ్మగారు బెంగ పెట్టుకుందనీ, నువ్వు వేగిరం రావాలి అనీ మా వాళ్ళు ఉత్తరాలు, టెలిగ్రాములు పంపారు. కాబట్టి మీరంతా వెళ్ళండి.

రాజా: ఏమోయ్ రాజీ! నాకుమాత్రం ఇంటికి వెళ్ళాలని లేదుటోయి! మావాళ్ళని పిల్లలను చూసి చాలా రోజులయింది. మా అమ్మ బెంగపెట్టుకుంది. పైగా నేను అమలాపురంలో దుకాణం పెట్టాలని నిశ్చయించుకున్నాను. అశ్రద్ధ చేసేందుకు వీలులేదు. నాకుమాత్రం వచ్చేందుకు వీలుందా? అయినా బయలుదేరుతున్నానా లేదా?

నట: నాకూ తీరుబడిదాలేదు. ఇప్పుడుదా మా హాస్పత్రులు నిండాపనిలో ఉండును.

ఆలం: ఏ రైటరుకో లంచమిస్తే సరి...

రాజా: అంతమంది డాక్టర్లున్నారు. నీవే అవసరమా?

ఆలం: అబ్బాయిలు! ఎవ్వరూ ఏమీ అభ్యంతరం పెట్టేందుకు వీలులేదు. ఇంక మూడురోజుల్లో బొంబాయి మెయిలుమీదో, ఎక్సుప్రెస్ బండి మీదో ప్రయాణం. రాజేశ్వరుని బడాయిమాటలు ఎవరెరుగరురా? రాజమండ్రిలో గులాబిపుష్పాల సువాసన ఇక్కడికి కొట్టి వీడికి వెఱ్ఱెత్తుతోంది.

రాజే: నాకు కోపం తెప్పించకోయ్!

ఆలం: నవాబులు ఒకళ్ళ బెదిరింపులకు బెదరరు. పుష్పం మనదైతే ఎప్పుడైనా దొరుకుతుందికాదుట్రా రాజీ.

రాజే: ఒరే ఆలం! జాగ్రత్తరోయ్. నీపని శ్రుతిమించి రాగాన్ని పడుతోంది.

ఆలం: గ్రామఫోనువాళ్లను పిలిపించరా మరి!

నట: రాజీ అపశ్రుతిదా అవుతాడేమో.

రాజా: మీకంతా వెఱ్ఱియెక్కినట్లుంది. మీకందరికీ మెదడుశస్త్రం చేయించాలిరా. ఆ నాచుపట్టిన మెదళ్ళన్నీ కాస్త బాగు చేసి మళ్ళీ పెట్టేస్తాను. ఏవంటారోయి!

రాజీ: డాక్టర్లు కురుపులు కడుక్కుంటూ, మాత్రలు నూరుకుంటూ కూచోక, వేళాకోళాలుకూడానూ!