పుట:Narayana Rao Novel.djvu/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్నేహితుల కాహ్వానము

235

ఆలం స్వస్థలమగు నేలూరి కెన్నిసారులో పోయి, నారాయణరావు మొదలగు మిత్రు లాలంగారి యింటిలో మకామువేసి, భోజనమునకు మాత్రము హోటలునకు బోయి, తక్కిన ఫలహారాదు లాతని యింటనే భుజించుచుండిరి.

ఆలం మంచి వస్తాదు. కుస్తీలో నేర్పరి. కాలిబంతిలో, హాకీలో వెనుకటి యిద్దరి యాటగాళ్ళలో నొకడు. వెనుకనుండి యాతడు బంతిని కొట్టినచో అది ఆవలి కక్షవారి గోలు (బంతి దాటిపోకుండ కాపాడవలసిన రెండు కఱ్ఱల మధ్య స్థలము) వరకు పోయెడిది. అందుకని ఆలంకు ‘ఫుట్‌బాల్ పులి’ యని పేరు వచ్చినది. ఈ కాలిబంతియాటవలననే ఆలం నారాయణరావులకు స్నేహము వృద్ధియైనది.

ఆంధ్రదేశ మేయాటలయందును బేరువహింపలేదు. కాలిబంతికి కలకత్తా, క్రికెట్టునకు బొంబాయి, చెన్నపట్టణము, లాహోరు మొదలగునవి, హాకీకి పంజాబు, టెన్నిసునకు మదరాసు, కలకత్తా, పంజాబు, అలహాబాదు మొదలగునవి ప్రసిద్ధి. ఆంధ్రులలో నేడు కొంచెము టెన్నిసు, కాలిబంతి, హాకీ, క్రికెట్టులు వృద్దినందినవి.

కాని యాంధ్రులలో గొందరువీరులు వివిధ క్రీడలలో బేరుగాంచినారు. క్రికెట్టునందు సి. కె. నాయుడు, సి. ఎస్. నాయుడు, రామస్వామి, బాలయ్య మొదలగువారు; టెన్నిసుఆటలో రామస్వామి, నారాయణమూర్తి, కృష్ణస్వామి మొదలగువారలు. ఏది ఎటులయిన నాంధ్రులు నిద్రమత్తువారు. సహజమగు క్రీడాకౌశల మున్నను అది వృద్ధిచేసికొనరు. పరదేశములకుబోయి పేరు సముపార్జింపరు.

ఆలంకు ఆటలన్న ప్రాణము. అతనికి రాజ్యాంగ వ్యాపారము లవసరము లేదు. మతవిషయములమాట మనసు చొరదు. ఆర్థికవ్యవహారము లాతనినంటవు. ఆటలు! ఆటలు! హిందూపత్రిక నాటల వార్తలకే చదువును. తక్కినపుటలు చదువడు. సినిమా కేగుటయైన నాతడు మానును గాని ఎమ్. యు. సి. లో గాని, ఎం. సి. సి. లో గాని, ఎస్. ఐ. ఎ. లో గాని బంతియాట ఆడుచున్నచో వెళ్లుట తప్పదు. ఇంగ్లండు దేశమునుండి గిర్లీగాను గారి నాయకత్వమున టేట్, మెర్‌సర్, పాండాం మొదలయిన క్రికెట్టు ఆటగాండ్రు వచ్చినప్పు డాలం చెన్నపట్టణములో చూచుటకు ముందు బొంబాయివెళ్ళి చూచివచ్చెను.

రాజే: ఒరే ఆలం! నారాయణా, పరమేశ్వరం ఎక్కణ్ణుంచిరా నీకు ఉత్తరం రాస్తా?

ఆలం: నాకు సాంచీనుంచి ఉత్తరం రాశారు. అందులో పరమేశ్వరం కవిత్వమే రాశాడు. నిన్ను తిట్టారురా యిద్దరూ! నేనూ, నటన్, రాజారావూ అజంతా వచ్చి కలుసుకుంటే, అజంతా, ఎల్లోరా, నాసిక, ఔరంగాబాదు, ప్రతిష్ఠానము, కార్లే, కన్హేరి, ఎల్ఫాంటా, పూనా, వాతాపి, బీజపురం, పండరీపురం, హైదరాబాదు, ఒరంగల్లు, పాలంపేట అవన్నీ చూచి అక్కడినుండి