పుట:Narayana Rao Novel.djvu/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

226

నా రా య ణ రా వు

పోయేటట్టు ఉంది. విశాఖపట్టణం వెళ్ళిపోతే రాయలసీమవారు తప్పుకుంటారట. బెజవాడ ఆంధ్రదేశానికి మధ్యపట్టణం. అన్ని దేశాల నుంచి వచ్చే రైలుమార్గాలున్నై. పవిత్రమైన కృష్ణవేణినది ప్రవహిస్తూ ఉన్నది.

‘అబ్బాయి, ఈసబబులన్నీ విచారించేవాళ్ళు ఎక్కువమంది ఉండరురా బాబూ! రేపో యెప్పుడో శాసనసభలో విశాఖపట్టణం విశ్వవిద్యాలయ ప్రధానస్థానం కావాలి అని బిల్లు పెట్తున్నారు. ఆమోదిస్తారు. సరే, దానికి కాదు. వీరు ఇంతా చేసి మద్రాసు విశ్వవిద్యాలయంకన్న ఇందులో ఏమి కొత్తదనం వెలగబెట్టారు అనే నా విచారం.’

కాశీనుండి సారనాథు వెళ్ళి యచ్చట పురాశిల్ప రక్షణశాఖవారు స్థూపమును త్రవ్వి బయలుపరచిన సంఘారామకట్టడములు చూచినారు. శృంగ ఆంధ్రరాజ్యకాలముల విజృంభించి, గుప్తరాజ్యకాలమున బేరొందిన యా స్థూపమును మహాబోధి సంఘమువారు వృద్ధిపరచుచు నూతన సంఘారామము నిర్మించుచున్నారు. బుద్ధుని విగ్రహములు, మంజుశ్రీ తారావిగ్రహము లచ్చట శిల్పకళాచమత్కృతి వెదజల్లుచున్నవి. అశోకుడు బౌద్ధమతావలంబియై, భక్తుడై, సర్వ సర్వంసహామండలములో హింసకు చోటులేకుండ చేయుటకు, తథాగతుని బోధ లోకమెల్ల ప్రజ్వలింపజేయుటకు దీక్షవహించిన దినములలో నా స్థూపము ప్రారంభింపబడినది. అశోకుని శిలా స్తంభమచ్చట నొకటియున్నది. రానురానా సంఘారావము వృద్ధినొందినది. ఆ స్థలము వేణువనము. బుద్ధుడై యా లోకపావనుడు దేశములనెల్ల సత్యమార్గమును బోధించి యా వేణువనాన ఆశ్రమ మేర్పరచుకొని లోకమెల్ల మార్తాండుడు వెలుగు వెదజల్లురీతి తన బోధను ప్రకాశింపజేయుచుండెను.

పరమేశ్వరు డా ప్రదేశమంతయు దిరుగుచుండెను. నారాయణరావా స్థూపమున కెదురుగ పద్మాసనోపవిష్టుడై యర్ధనిమీలిత నేత్రుడై, యా బుద్ధపరమాత్మను ధ్యానించుకొనుచుండెను. అతని వాక్కుల అమృత ధారలు నారాయణరావు కర్ణముల ప్రతిధ్వనించినట్లయినది. పరమేశ్వరు డా పవిత్రమూర్తి పద్మాసనధారియై జ్ఞానముద్రతో ‘ఓం మణి పద్మిహమ్’ అని జ్ఞానోపదేశము చేయుచున్నట్లు భావించినాడు.

కాశీనుండి ప్రయాగ వెళ్ళి, త్రివేణీ సంగమములో మన స్నేహితులు కృతావగాహులైనారు. త్రివేణీ సంగమములో రెండువేణులే కలియుచున్నవి. మూడవ వేణి యంతర్వాహినియట. యమున నీలగాత్ర, గంగాదేవి ధవళశరీర, సరస్వతి సువర్లచ్చాయావర్తన, యమున కూర్మవాహన, గంగ మకరవాహన, సరస్వతి పద్మవాహన.

ఆ సూర్యతనయ కూర్మవాహన మంగీకరించి యెన్ని వేలేండ్లు గడచెనో, నేటికిని యమునాకచ్ఛపము లా నీలంపు లోతులలోకి నీదులాడుచు,తేలికొనుచు, మునుగుచు సంచరించును. యమునకంటే గంగ లోతుతక్కువ. సరస్వతి లోతు