పుట:Narayana Rao Novel.djvu/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

224

నా రా య ణ రా వు

బయలుదేరుతవి. ఆ ఆచారాలనూ, చిహ్నములనూ అనుసరిస్తేగాని మోక్షం లేదు అనుకోవడమంత మూర్ఖత ఇంకోటి లేదు. నామాలుపెట్టి, గండభేరుండంచుల పంచెలుకట్టి, విష్ణ్వాలయాలలోనికి వెళ్ళి, విష్ణునిమాత్రం కొలిచేవాడు వైష్ణవుడనిన్నీ; తలంతా గొరిగించుకొని గడ్డం పెంచుకొని మహమద్ వారుమాత్రమే దైవము యొక్క మతము బోధించేవారనిన్నీ, ఖురానుమాత్రమే మతగ్రంథ మనిన్నీ, ఒక దైవమే యున్నాడనిన్నీ, రెండు దేవుళ్లు లేరనిన్నీ నమ్మేవాడు మాత్రమే మహమ్మదీయుడనిన్నీ; బాప్టిజం పుచ్చుకొని, యేసుక్రీస్తు దేవుని కుమారుడనీ, ఆతనిద్వారానే మోక్షం వస్తుందనీ, ఏసును నమ్మకుండా ఉన్న వాడికి నరకం అనిన్నీ, నమ్మేవాడే క్రైస్తవమతస్థుడనీ వాదించడంకంటే పరమ ఛాందసం లేదురా పరం.’

‘మన మహర్షులు మాత్రమే చెప్పగలిగారురా సర్వమతాలు దైవాన్ని చేరుకుంటాయి’ అని.

‘అలా అనకు. క్రీస్తుగాని మహమ్మదుగానీ అలా చెప్పలేదనా నీ ఉద్దేశము? కాదు. ప్రతి అవతారపురుషుడు అలాగే చెప్పాడు.’

‘నువ్వనేది, సరియైన జ్ఞానముతో సంచరించేవాడు, సత్యాన్ని కొలిచేవాడు, ఏ మతంవాడైనా సరే మోక్షము చెందుతాడు అని రామకృష్ణ పరమహంస ప్రపంచానికి బోధించిందే నిజమంటావు. అంతేనా?’

‘అవును మరి. ఆయన మహమ్మదీయుడై అల్లాను ప్రార్థించి భగవంతుణ్ణి సాక్షాత్కరింపజేసికొన్నాడు. క్రైస్తవుడై జెహోవాను స్వాధీనము జేసుకొన్నాడు. రాధ అయి శ్రీకృష్ణునీ, హనుమంతుడై రాముని సాన్నిధ్యము పొందాడు. అందరూ ఒక్క పరమాత్ముని మహాభావమే కాదుట్రా?’

బేలూరు మఠం చూచి, చందా యిచ్చి, కలకత్తానుండి బయలుదేరి, మన యాత్రికులు గయ వెడలినారు. ఫల్గునీనదిలో స్నానమాడినారు. శ్రీరామగిరి దర్శించి శ్రీరాముడు ప్రతిష్ఠించిన మరకత రత్న ఘటిత స్ఫటికలింగమును దర్శించినారు. బుద్ధగయ కేగి యచ్చట సిద్ధార్థుడు బుద్ధుడైన ప్రదేశములో గూర్చుండి, యా పరమపురుషుని ధ్యానించి, యా దేవాలయ రచనాచమత్కృతికి సంతసించినారు. ఇదే ఔత్తరాహమగు ప్రథమ దేవాలయము. బుద్ధభగవానుడు నిర్యాణమొందినవెనుక నాతని దేహమునకు దహనసంస్కారము లైనవి. అప్పుడా తథాగతుని వపువులోని బొమికలు, దంతములు మొదలగునవి బరిణెలలోనుంచి దానిని వివిధ దేశములకు నాయనశిష్యులు పంపించినారట. ఆ బరిణెలనందిన మహారాజులు వానిని పవిత్ర స్థలములందు స్థాపించి వానిపైన రాతితో, నిటుకతో, మట్టితో దిబ్బలుకట్టిరి. వానిపై శిల్పములుంచిరి. అయ్యవి స్థూపము లన్నారు. ఆ స్థూపములు పవిత్ర ప్రదేశములు. భక్తులు వానిపై వారి కళా ప్రజ్ఞయంతయు జూపించినారు. దానికి తోరణములు, చుట్టును శిల్పములు చెక్కిన కంచెలు నేర్పరచిన మహారాజులు వానికై కోట్లు