పుట:Narayana Rao Novel.djvu/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉ త్త ర హిం దూ దే శ యా త్ర

223

మొక్కజొన్నపొత్తివలె నుండును. మూలమునుండి శిఖరమువరకు రాళ్ళ తోడనే కట్టెదరు, ఎఱ్ఱయిసుకశిల, సుందరశిల్పలాలిత్య మా రాతిలో రూపించునట్లు వేరొకరాతిలో రూపింపలేదు. గాంగశిల్పులు స్త్రీరూపరచనమున దన్మయులైనారు. బ్రహ్మ పూవులతో, లతలతో, లేతయాకులతో, తేనెలతో, లేడికన్నులతో, చుక్కతళుకులతో, వెన్నెలవెలుగులతో స్త్రీమూర్తిని సృజించినాడన్న మాటను ఆ శిల్పులు నిక్కువముచేసినారు. గాంగులు ఆంధ్రులు. ఉత్తరాంధ్ర శిల్పులు గాంగశిల్పులు.

భువనేశ్వరములో రాజారాణి, పరమేశ్వర, మార్కండేయేశ్వర, లింగేశ్వరుల దేవాలయములలోను, కోణార్కలోను, ముఖలింగములో, సాక్షిగోపాలములో గాంగశిల్పుల శిల్పలాలిత్యము ప్రత్యక్షమగుచుండును. గుడియంతయు లతలు చెక్కియుండును. మధ్య మధ్య విగ్రహములు పొదిగింపబడును. దాక్షిణాత్య దేవాలయముల రీతి వేఱు. చోళ, పాండ్య, చాళుక్య దేవాలయములలో గర్భగుడిపైనుండి శిఖరమువరకు గట్టిగా రాతికట్టడమో, యిటుకకట్టడమో కట్టుకొనిపోదురు. కాని గాంగదేవాలయములకు దేవాలయపాదము నుండి శిఖరమువరకు లోన గుల్లగా కట్టుకొనిపోదురు. తెలుగుచోడుల దేవాలయములలోనూ గర్భాలయము గుల్లగానే యుండును.

భువనేశ్వరములో రెండువందల దేవాలయములున్నవి. ప్రతి దేవాలయమునకు మిక్కిలి లోతుగల కోనేరులున్నవి. ఎచ్చటనుండియో జలము వచ్చునట్లు చేసి, యా జలము పొలముల కుపయోగించునట్లా శిల్పు లమర్చిరి. జగన్నాథమునందు మొండిజగ్గని యందము దిలకించి, సాక్షిగోపాలము, శ్రీకూర్మము దర్శించి, నారాయణరావు పరమేశ్వరమూర్తులు కలకత్తా చేరుకొన్నారు. కలకత్తాలో మ్యూజియము, దక్షిణేశ్వరము, కాళీఘట్టము, సర్వవృక్షవనము, జంతుశాల, విక్టోరియా మందిరము, జైనమహాభవనము, బోసుగారి వృక్షశాస్త్ర పరిశోధక భవనము మొదలైనవి చూచినారు.

శ్రీ రామకృష్ణపరమహంస నిర్వికల్పసమాధి నందిన పంచవటి, మాత దేవాలయము, ఆ భక్తమూర్తి, యవతారపురుషుడు మెలంగిన యా పవిత్రస్థానము చూచునప్పటికి నారాయణ పరమేశ్వరులు పులకరించిపోయిరి.

ఈ మహాపురుషుడు సర్వమతములు హిందూమతములోనివే యని లోకమునకు దెల్పుటకు, సర్వమతముల వారికి ఆత్మవిద్యాభిక్ష మా మతమే పెట్టినదని తెల్పుటకు అవతరించెనని, నారాయణరావు పరమేశ్వరునకు తెలిపెను. రామకృష్ణునకు చదువురాదు. ఈశ్వరచంద్ర విద్యాసాగరులవంటి పండితు లా పరమహంసకు జోహారులన్నారు. కేశవచంద్రసేనువంటి మహానుభావు లాతని పాదములకడ నాత్మజ్ఞానము సముపార్జించుకొన్నారు.

‘శ్రీ రామకృష్ణపరమహంసకు వివేకానందస్వామి అర్జునుడంటివాడురా. నరనారాయణులే వారిరువురున్నూ. ప్రతిమతంలోనూ కొన్నికొన్ని ఆచారాలు