పుట:Narayana Rao Novel.djvu/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉ త్త ర హిం దూ దే శ యా త్ర

221

లయమునను బ్రతిష్ఠ జరుగలేదు. మహారాజు సూర్యదేవునకు దేవాలయము సంకల్పించి తన యాస్థానమహాశిల్పి నా కార్యమున నియోగించెనట.

ఆస్థానశిల్పికొక పుత్రుడున్నాడు. ఆతడు తండ్రికడ శుశ్రూష సలిపి జనకుని యుత్కృష్ట శిల్ప చమత్కృతియు, శక్తియు నభ్యసించి, దేశ దేశములకు బోయి అందందుగల శిల్పసాంప్రదాయముల గమనించివచ్చెదనని తండ్రి యనుమతి కోరినాడట. తండ్రి యితరదేశముల శిల్పులలో భావనయందు, బనితనమునందు తన్ను మించినవారు లేరని పుత్రుని యాత్రాకౌతుకము మాన్ప జూచెనట. కుమారున కది తండ్రియందు దోష మనిపించినది. కాన తండ్రికి నమస్కరించి, ‘తండ్రీ! మనకెప్పుడును గర్వము హానికర’ మని చెప్పి చలమున విదేశయాత్ర సాగించినాడట.

ఇచట తండ్రి దేవాలయము నతి విచిత్రముగ నిర్మించి శ్రీవిమానమున శిఖరమువరకు గట్టినాడట. ముఖమండపములు, భక్తిమందిరము, వివాహ మండపము, క్షేత్రపాలకాలయము, పరిసేవిత దేవతాలయములు నిర్మింపబడినవి. సింహగజాశ్వాది మృగములు, నద్భుత సుందరవనితా విగ్రహములు, దేవతా శిల్పములు మున్నగునవియెల్ల నా శిల్పచక్రవర్తియు నాతని శిష్యులును జెక్కి యమర్చినారు. దేవళము నద్భుతమై విరాజిల్లినది. కాని కూపస్థమండూకమువలె నున్న యా శిల్పికి శ్రీవిమానశిఖర పద్మశిల నమర్చు నుపాయము తెలియలేదట. అత డంతట మహారాజుతో నిజము వచింపక తనకొక ముఖ్యావసరమగు కార్యమున్నదని చెప్పి, యితరదేశ శిల్పుల నారహస్యమడిగి తెలిసికొనుటకు బయలుదేరి పోయినాడట.

ఇంతలో దైవజ్ఞులు పదునయిదు దినములలో మంచి ముహూర్తమున్న దనియు, కొన్ని సంవత్సరములవరకు నట్టి ముహూర్తము మరల దొరకదనియు మహారాజునకు విన్నవించినారట. మహారాజు సమయమునకు శిల్పి దేశాంతర గమనుడగుటకు వగచి, యాతని శిష్యులలో శిఖర మమర్చగలనారుండిరా యని పృచ్ఛచేసి యేరును లేకుండుటకు జింతాకులుడై, తన శిల్పికై చారుల బంపినాడు.

ఇంతలో నాస్థానశిల్పి కుమారుడు తన యాత్ర ముగించుకొని నిజపురికి తిరిగివచ్చి యీ సంగతులన్నియు విన్నాడు. తండ్రిగారికి నపఖ్యాతి వచ్చునట్లున్నదని భయపడి యా కార్యమునకు దానియ్యకొని, వలయు సన్నాహము లన్నియు నొనర్చుచుండెను. జనకున కలవికాని యీ కార్యము తాను సాధించినచో నభిమానియగు నాతనికి కోపమురాగలదని సంశయించి, ఆ కుమార శిల్పి ప్రచ్ఛన్నుడైయుండి తనవారి కెవ్వరికి నిజస్థితి తెలుపకయే కార్యమునకు బూనుకొనెను. పదిపండ్రెండు బారువుల బరువుగల శిఖరశిలను, విమానమూలమున ప్రక్కగానొక యిసుక దిబ్బపై పెట్టించి, మహారాజుతో రోజునకు వేనకు వేలు బండ్లు సముద్రమునుండి యిసుక తెప్పించి యాదిబ్బ యెత్తుచేయించ కోరెనట, బండ్లువచ్చి యిసుకదిబ్బ నెత్తుజేయుచుకొన్నకొలది యాబాలశిల్పి, యా