పుట:Narayana Rao Novel.djvu/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా కు ప్రే మ లే దు

219


ఆ బాలిక యన్న గారికడకు వచ్చి ‘నువ్వూ వెళ్లిపోతున్నావా అన్నయ్యా! నా కసలే తోచదు’ అన్నది. నారాయణరావు చెల్లెలిని దగ్గరకు దీసికొని ‘సూరీడూ! నీ కేమిటి తెచ్చిపెట్టనే?’ అని యడిగినాడు.

‘నీకే తెలుసును అన్నయ్యా! అన్నిటికన్నా నువ్వు దబ్బునరావడం కావాలి చిన్నన్నయ్యా!’

‘అలాగా, తల్లీ.’

ప్రేమపదార్థము దాగదు. ఈ బాలిక, తన చిట్టిచెల్లెలు, ప్రేమంపుముద్ద. ఆమె హృదయము నవనీతము. ఈ బాలికను వివాహముచేసికొన్న రామచంద్రుడే పూర్ణముగ నదృష్టవంతుడు. వీరిరువురి జీవితము చూడ ముచ్చట యగునుకదా?’

క్వినైను భైసల్ఫేటు మాత్రలు, క్వినైను సాలిసిలీసు, టించరు అయిడీను, టించరు బెంజాయిను, లైజాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ , ఆనందభైరవి, శీతాంకుశరసము, సన్నిపాతభైరవి, పైత్యాంతకరసము, సుఖవిరేచనమాత్రలు, పెర్‌మాంగనేటు మాత్రలు, కాలోమెల్ మాత్రలు, అమృతాంజనము, ప్రోడయేరియా మందు మొదలగు నౌషధములు, అరువది యడుగుల గట్టిత్రాడు, వంటగిన్నెలసెట్టు, నెయ్యి వీశెడు, వీశెడు పప్పునూనె, కొంత బియ్యము, పచ్చికారపుపొడి, ఎండుమిర్చి, చింతపండు, కొన్నికూరలు, ఆవకాయ, మాగాయ, పాతచింతకాయ, నిమ్మకాయ, గోంగూరపచ్చడి, చారుపొడి, కారప్పొడి, చాకు పెద్దది యొకటి, చిన్నది యొకటి, గాలితుపాకి, కఱ్ఱకత్తి, రెండునెలలకు సరిపోయిన బట్టలు, రెండు దోమ తెరలు, ప్రయాణపు మడతమంచములు, చిన్న పరుపులు రెండు, రెండు తోలు పెట్టెలు, రెండు దేవదారు పెట్టెలు సర్ది సిద్ధమైనాడు నారాయణరావు.

ఈలోన నారాయణరావు పరమేశ్వరమూర్తికి దనతో దేశయాత్రకు రమ్మనియు, ఖర్చులన్నియు దానే పెట్టెదననియు, భార్య నామె బుట్టింటిలోన గాని, యాతని తల్లిదండ్రులకడగాని దిగబెట్టి రావలయుననియు, నీ సమయము దాటినచో మరల పరమేశ్వరునకు దేశయాత్ర చేయుటకు వీలు దొరకదనియు వ్రాసినాడు. పరమేశ్వరమూర్తి వెంటనే దేశోద్ధారక నాగేశ్వరరాయనికడకు బోయి, సెలవుపుచ్చుకొని, భార్యను దీసికొని, యామె పుట్టినగ్రామమగు బెజవాడలో వదలిపెట్టి, నారాయణరావును రాజమహేంద్రవరములో గలిసికొనెను.

వారశూలలు, రాహుకాలము, గుళికకాలము, వర్జము లేకుండగను, నక్షత్రము, వారము, తిథి, రాశిరహితముచేసి తారాబలము చూచుకొని, పుష్కర సమయ ముహూర్తమున తల్లిదండ్రులు, పెదతల్లి మొదలగు పెద్దల పాదములకు నమస్కరించి, చెల్లెలిని ముద్దుగొని మోటారుపై బయలుదేరినాడు నారాయణరావు. ప్రయాణమగుచుండ ముత్తైదు వెదురుగ వచ్చినది.